AIFF | ఢిల్లీ: ఇటీవల కాలంలో నిత్యం ఏదో ఒక వివాదంతో సతమతమవుతున్న ఆలిండియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి.. ఏఐఎఫ్ఎఫ్ ఉన్నతాధికారుల తీరుపై ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేస్తూ ‘మాకు ఇక్కడ భద్రత లేదు. మా వ్యక్తిగత, అత్యంత గోప్యంగా ఉండాల్సిన సమాచారం ఇంటర్నెట్లో లీక్ అవుతోంది. మేం వాష్రూమ్స్లో ఉన్న ఫొటోలు కూడా లీక్ అవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది..’ అంటూ కంప్లయింట్స్ కమిటీకి లేఖ రాయడం కలకలం రేపింది.
బాధితురాలి వ్యక్తిగత వివరాలు, ఆఫర్ లెటర్, ఇతర సమాచారమంతా ఈ నెల 4న యూట్యూబ్లో లైవ్ రావడంపై ఆమె కమిటీని ఆశ్రయించింది. ఈ ఏడాది మార్చిలో ఓ పురుష ఉద్యోగి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు ఇచ్చిన మహిళ ఒక్కరే కావడం గమనార్హం.