(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో ఎనిమిదో రోజు ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలే లక్ష్యంగా 80 యుద్ధ విమానాలు, 230 బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీనికి దీటుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులు జరిపింది. దీంతో పశ్చిమాసియా అగ్ని గుండాన్ని తలపిస్తున్నది. మరోవైపు, ఇరాన్‌లోని పౌరుల నివాసాలు, పాఠశాలలే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులకు పాల్పడుతున్నాయని ఇరానీయన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో 1,300 మంది మరణించినట్టు సమాచారం. మరోవైపు చమురు రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, అమెరికా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇరాన్‌పై శనివారం అమెరికా-ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులు విరుచుకుపడ్డాయి. 80 యుద్ధ విమానాలు, 230 బాంబులతో శనివారం వేకువజామున ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అలాగే, ఇరాన్‌లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. తూర్పు లెబనాన్‌లోని నబీచిట్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 26 మంది మరణించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌పై ఇప్పటివరకూ చేసిన దాడుల కంటే అతిపెద్ద దాడి చేయడానికి తమ సైన్యం సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. శనివారం ఇరాన్‌పై భీకర దాడులు జరుగబోతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పేర్కొన్నారు. వాళ్లు చెప్పినట్టుగానే శనివారం ఇరాన్‌పై తీవ్రమైన దాడులు జరిగాయి. మరోవైపు, యుద్ధం నేపథ్యంలో ఇరాన్ వైపు ఇప్పటికే రెండు యుద్ధ విమాన వాహక నౌకలను పంపించిన అమెరికా.. తాజాగా మరో వాహక నౌకను పంపించింది. ఇంకోవైపు, యుద్ధం తీవ్రత పెరుగుతున్న క్రమంలో భారీ మొత్తంలో సైనిక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఇజ్రాయెల్‌కు విక్రయించడానికి తమ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది.
గడిచిన 8 రోజుల్లో ఇరాన్‌లోని పౌరుల నివాసాలు, స్కూల్స్ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు జరిపాయని ఇరానీయన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. 5,535 నివాస భవనాలు, 1,041 వాణిజ్య భవనాలు, 14 మెడికల్ సెంటర్లు, 65 పాఠశాలలు, 13 రెడ్ క్రెసెంట్ కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరిపినట్టు వెల్లడించింది.
ఇరాన్ కూడా ప్రతీకార దాడుల తీవ్రతను పెంచింది. అబుధాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ భారీ పేలుళ్లు జరిపింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దయెత్తున పొగ వ్యాపించింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో దాడులు జరగ్గా.. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన కొన్ని విమానాలు గాలిలో చక్కర్లు కొట్టినట్టు సమాచారం. పలు విమానాలను రద్దు చేశారు. 300 మిలియన్ డాలర్లతో నిర్మించిన జోర్డాన్‌లోని అమెరికా థాడ్ రాడార్ సిస్టమ్‌ను ఇరాన్ పేల్చేసింది. యూఏఈలోని అమెరికా ఎయిర్ కాంబాట్ సెంటర్‌తో పాటు మరో శాటిలైట్ కమ్యునికేషన్ హబ్‌ను పేల్చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) వెల్లడించింది. బహ్రెయిన్ తన గగనతలాన్ని మూసేయగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ఖతార్‌లోని భారత పౌరులకు అక్కడి ఎంబసీ కీలక సూచన జారీ చేసింది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతున్నది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. దాడులకు సంబంధించి గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణలు తెలియజేశారు. ఇకపై గల్ఫ్ దేశాలపై తమ నుంచి ఎటువంటి దాడి జరుగబోదని హామీనిచ్చారు. అయితే, గల్ఫ్ దేశాలు తమపై ప్రత్యక్ష దాడికి దిగితే, తామూ అదే రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని వెల్లడించారు. ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణల ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులతో ఇరాన్ తోక ముడిచిందని ఎద్దేవా చేశారు. ఇకపై ఇరాన్ గల్ఫ్ దేశాలపై బెదిరింపులకు పాల్పడబోదన్నారు.
ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా యుద్ధనౌక ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని తిరిగి ఇరాన్‌కు పంపొద్దని శ్రీలంక ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చింది. అలాగే, శ్రీలంక కస్టడీలో ఉన్న ఇరాన్ రెండో నౌకలోని సిబ్బందిని కూడా వారి స్వదేశానికి పంపించవద్దని చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, దీనిపై శ్రీలంక స్పందన ఎలా ఉందన్న విషయం తెలియరాలేదు.
హొర్ముజ్ గుండా నౌకల రవాణా విషయంలో అమెరికా-ఇరాన్ ఢీ అంటే ఢీ అన్నట్టు చేస్తున్న ప్రకటనలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. పశ్చిమ దేశాలను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా హొర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇటీవల ఇరాన్ ప్రకటించింది. జలసంధి గుండా ఏ నౌక ప్రయాణించినా కాల్చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళనలో పడ్డాయి. దీన్ని గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వివిధ దేశాల వాణిజ్య నౌకలకు తాము భద్రత కల్పిస్తామంటూ ప్రకటించారు.
జలసంధి మీదుగా చమురు నౌకలకు రక్షణగా వెళ్లేందుకు తమ దళాలు సిద్ధమవుతున్నాయని అమెరికా ఇంధనమంత్రి క్రిస్ రైట్ తాజాగా ప్రకటించారు. దీనిపై ఇరాన్ స్పందించింది. హొర్ముజ్ జలసంధి వద్ద అమెరికా దళాలను ఎదుర్కొనేందుకు వేచిచూస్తున్నట్టు ఐఆర్జీసీ తెలిపింది. అమెరికా ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు 1987 లో సూపర్ ట్యాంకర్ బ్రిడ్జ్‌టన్‌కు జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకోవాలని ఐఆర్జీసీ ప్రతినిధి అలీ మహ్మద్ నైనీ హెచ్చరించారు. 1987 లో కువైట్‌కు చెందిన బ్రిడ్జ్‌టన్ ట్యాంకర్ పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తుండగా.. అమెరికా నావికాదళం రక్షణగా నిలిచింది. అయితే ఐఆర్జీసీ చేసిన దాడిలో ఆ నౌక దెబ్బతిన్నది. ఆ ఉదంతాన్ని గుర్తు చేసిన నై నీ.. అమెరికాను పై విధంగా హెచ్చరించారు.