గుట్టలు, చెట్లకు రైతుబంధు ఇవ్వం. సర్వే చేసి వీటన్నింటినీ తొలగిస్తాం. అందుకే గ్రామాల్లో రైతుబంధు కావాలనుకునే వాళ్లను దరఖాస్తు చేసుకోవాలని చెప్తు న్నాం. అసెంబ్లీలో చర్చపెట్టి కొత్తగా తీసుకొస్తాం.
-సీఎం రేవంత్
ఇక నుంచి అర్హులకు మాత్రమే రైతుబంధు ఇస్తాం. పెట్టుబడి పంపిణీలో మార్పులు చేస్తున్నాం. ఎన్నికలు ముగియగానే నిబంధనలు రూపొందించి పంట పెట్టుబడి ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయిస్తాం
– మంత్రి తుమ్మల
ఐదు.. పది ఎకరాలకు రైతుబంధు పరిమితం చేయాలి. కొండలు, గుట్టలకు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. దీనివల్ల ప్రజాధనం అంతా వృథా అవుతుంది.
– కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
రాష్ట్ర విభజనకు ముందు, విభజన సమయంలోనూ తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం రాదని, రాష్ట్రం విడిపోతే వాళ్లు అన్నమో రామచంద్రా..! అనడం ఖాయమని ఎద్దేవా చేశారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న కేసీఆర్.. తెలంగాణ రైతులు దేశంలో ఎవరికీ తీసిపోరని నిరూపించటానికి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్రంలో చితికిపోయిన తెలంగాణ రైతు బతుకును మళ్లీ చిగురింపజేయటమే ధ్యేయంగా దేశంలో ఎక్కడాలేని సంచలన, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు.
మిషన్ కాకతీయతో చెరువుల బాగు, భూగర్భ జలాల పెంపు, కాళేశ్వరంతో సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు పేరుతో పెట్టుబడి సాయం, రైతుబీమా పేరుతో ఆపద సాయం, పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనటం.. ఇలా 360 డిగ్రీల కోణంలో రైతుబాగు కోసం చర్యలు తీసుకున్నారు. దీంతో తెలంగాణలో వ్యవసాయ విప్లవం సాధ్యమైంది. కేసీఆర్ పదేండ్లు కష్టపడి వ్యవసాయాన్ని ఒక దారికి తెస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల మాట విని, అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని, ఐదు నెలల్లోనే రైతులను ఆగం చేస్తున్నది.
కేసీఆర్ స్వయంగా రైతు. వ్యవసాయంలోని కష్టనష్టాలు తెలిసినవాడు. రైతు సాధక బాధకాల గురించి పూర్తిగా అవగాహన ఉన్నవాడు. అందుకే రైతు బాగుంటే పల్లె సీమలు బాగుంటాయన్నది కేసీఆర్ కాన్సెప్ట్. ఒకసారి బతుకు బాగుపడితే రైతు.. ప్రభుత్వం మాట వింటడనీ, అప్పుడు నియంత్రిత పంటల విధానంలోకి మార్చాలని కేసీఆర్ ప్రణాళిక రచించుకున్నరు. ఆయన ఊహించినట్టే ఈ చర్యలతో తెలంగాణ రైతు తెరిపినబడటమే కాదు.. దేశంలోనే తెలంగాణ సాగును నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు. ఫలితంగానే కేసీఆర్ పాలనలో తెలంగాణ జీఎస్డీపీలో వ్యవసాయ రంగం వాటా ఏకంగా 18.6 శాతానికి చేరింది.
వ్యవసాయం అనేది రోజువారీ పని. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంటే రైతు పొలం వద్దకు వెళ్లి సాగు పనులు చూసుకోవాలా? లేక ప్రభుత్వ ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరగాలా? కేసీఆర్‌కు ఈ సంగతి తెలుసు కనుకే ధరణి పోర్టల్ సాయంతో రైతుల వారీగా భూముల వివరాలను కంప్యూటరీకరించి, వారందరి అకౌంట్లు సేకరించి, రైతుబంధు రూపంలో ఏడాదికి రూ.15 వేల కోట్ల చొప్పున , దాదాపు రూ.లక్ష కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పైసల కోసం రైతులు ఏ దఫ్తర్కూ వెళ్లాల్సిన అవసరం లేకుండా, దస్కత్ పెట్టాల్సిన పనిలేకుండా, ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేశారు. దీన్ని పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ పంటలు వేసిన వారికే రైతుబంధు అనే పద్ధతి తెస్తామని చెప్తున్నది.
Rythu Bandhu | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పథకం.. ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్థంగా ఉన్న వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టింది. చితికిపోయిన రైతుల బతుకులను చిగురింపజేసింది. ఒకప్పుడు అన్నమో రామచంద్రా..! అంటూ దేహించిన తెలంగాణ.. ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగేలా చేసింది. ఇలా కేసీఆర్ తెచ్చిన ఈ పథకం వ్యవసాయ రంగంలో, రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందనటంలో ఎవరికీ సందేహం లేదు. అంతగొప్ప పథకాన్ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్నుకుట్టినట్టు ఉన్నది. అందుకే రైతుబంధు పథకాన్ని ఖతం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు ఉన్నది. ఆరేండ్లుగా సవ్యంగా అమలవుతున్న ఈ పథకంలో కోతలు పెట్టేందుకు కత్తులు నూరుతున్నది.
తలాతోక లేని షరతులను తెరపైకి తీసుకొస్తున్నది. తద్వారా రాజులా బతుకుతున్న తెలంగాణ రైతులను మళ్లీ దళారుల పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నది. ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్న వ్యవసాయాన్ని మళ్లీ ఛిన్నాభిన్నం చేసేందుకు కుతంత్రాలు చేస్తున్నది. ఇందుకు గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు రైతుబంధుపై చేస్తున్న వ్యాఖ్యలే ప్రభుత్వ కుట్రలు, కుతంత్రాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రైతుబంధులో మార్పులు చేస్తున్నామని, రైతులందరికీ పెట్టుబడి సాయం ఇవ్వబోమంటూ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. పంట సాగుచేసిన భూమికి మాత్రమే రైతుబంధు ఇస్తామంటూ వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ ఈ చర్యలు కచ్చితంగా రైతుబంధును ఖతం చేయడానికి వేస్తున్న ఎత్తుగడలు అని, తెలంగాణలో మళ్లీ దళారి రాజ్యాన్ని, పైరవీకారుల కాలాన్ని తెచ్చే పన్నాగమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన తెలంగాణ వ్యవసాయాన్ని కేసీఆర్ పదేండ్లు కష్టపడి ఒక దారికి తెస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఐదు నెలల్లోనే రైతును ఆగం చేస్తున్నది. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు సాగు నీళ్లు కరువయ్యాయి. కేసీఆర్ కట్టించిన కాళేశ్వరంపై కక్షగట్టిన కాంగ్రెస్.. ఆ ప్రాజెక్టును పనికిరానిదిగా ముద్ర వేసింది. తద్వారా కేసీఆర్‌పై ఉన్న కక్షను రైతులపై తీర్చుకున్నది. వెరసి రాష్ట్రంలో గత తొమ్మిదేండ్లుగా లేని కరువు నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోవటంతో పంటలు ఎండి రైతులకు కన్నీరే మిగిలింది. దీనికి తోడు కరెంట్ కోతలు కూడా మొదలయ్యాయి. పంటను కూడా కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొన్నది. ఇలా.. నీళ్ల కొరత నుంచి పంటల కొనుగోలు వరకు రైతులు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారు.
కేసీఆర్ రైతుబంధు అమలు ఉద్దేశం రైతులకు పెట్టుబడి తిప్పలు తప్పించటమే కాదు.. సాగులో లేని భూమిని సాగులోకి తీసుకురావటం కూడా. అందుకే కేసీఆర్ పంటల సాగుతో సంబంధం లేకుండా రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు ఇచ్చారు. 2018 వానకాలం నుంచి మొన్నటి వానకాలం వరకు ఏకంగా రూ.72,817 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమచేశారు. ఈ పెట్టుబడి సాయంతో రాష్ట్రంలో సుమారు కోటి ఎకరాల భూమి కొత్తగా సాగులోకి వచ్చింది. కానీ దీనిపై తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్.. రైతుబంధులో మార్పులు చేసి రైతుభరోసా పేరుతో ఈ వానకాలం నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగానే పథకంలో కీలక మార్పులు చేస్తున్నది. పంట సాగుకు, రైతుబంధుకు లంకె పెడుతున్నది. పంట సాగుచేసిన భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ మంత్రులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పంటసాగుతో సంబంధం లేకుండా రైతులకు ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు ఇచ్చేది. కానీ కాంగ్రెస్ మాత్రం పంట సాగుచేసిన భూమికే రైతుబంధు ఇస్తామని చెప్తున్నది. ఇదే జరిగితే ప్రతి రైతుకు సగం భూమికి రైతుబంధు బంద్ అవుతుంది. మొత్తంగా ఏటా కోటి ఎకరాలకు రైతుబంధు రాకుండా పోతుంది.
కేసీఆర్ స్వయంగా రైతు. రైతులు పడే కష్టాలు ఆయనకు పూర్తిగా తెలుసు. అందుకే రైతుల కోసం ఎంత చేయగలిగారో అంత చేశారు. రైతులను బతికించడమే లక్ష్యంగా ఆయన రాజకీయ ప్రయాణం, ప్రభుత్వ ప్రయాణం సాగింది. రైతుబంధు కావొచ్చు, రైతుబీమా కావొచ్చు, సాగునీళ్ల ప్రాజెక్టు రూపకల్పన కావొచ్చు.. ఆయన ఆలోచనలన్నీ రైతుల సాగుకష్టాన్ని తీర్చేవిగానే ఉంటాయి. రైతు వ్యతిరేక నిర్ణయాలు ఎవరు తీసుకున్నా ఉపేక్షించరు. మోదీ సర్కారు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలన్న ప్రతిపాదననూ తిరస్కరించారు. మీటర్లు పెట్టకపోతే ఏడాదికి రూ.25 వేల కోట్ల గ్రాంట్ కోత విధిస్తామన్నా, కేసీఆర్ తలొగ్గలేదు. పొరుగు రాష్ర్టాలు కర్ణాటక, ఏపీ మీటర్లు పెట్టినా.. రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణలో మీటర్లు పెట్టనీయలేదు. ఎప్పుడైనా సరే రైతును నిలబెట్టాలె, రైతు గర్వంగా బతకాలె అన్న కాంక్షతోనే కేసీఆర్ ఉంటారు.
రైతుబంధుకు, పంటసాగుకు లంకె పెడుతున్న కాంగ్రెస్ సర్కారు.. సాగు లెక్కను తేల్చేందుకు పలు విధానాలను అనుసరించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే రిమోట్ సెన్సింగ్ (శాటిలైట్ సర్వే) ద్వారా రైతుల పంట సాగు భూమిని లెక్కించనున్నది. దీంతో పాటు క్షేత్రస్థాయిలో ఏఈవోలు, ఇతర అధికారుల ద్వారా పంటసాగును నమోదు చేయించాలని భావిస్తున్నది. అయితే ఈ రెండు విధానాల ద్వారా కచ్చితమైన సాగులెక్క తేలుతుందా? అనేది ప్రశ్న. వాస్తవానికి ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ సాగు లెక్కలను నిర్ధారించేందుకు 100 శాతం సరైన విధానం అమల్లో లేదు.
ఇక రిమోట్ సెన్సింగ్ అనేది అక్షాంశాలు, రేఖాంశాలపై ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు సర్వే నంబర్ల వారీగా, రైతుల వారీగా పంటసాగును లెక్కించటం ఏ విధంగా సాధ్యమవుతుంది? అనేది మరో ప్రశ్న. ఒకవేళ మాన్యువల్‌గా ఏఈవోలు, ఇతర అధికారులతో సర్వే చేయిస్తే పలు అవకతవకలు జరిగే ఆస్కారం ఉన్నది. దీంతో పాటు ఈ లెక్క తేలడానికి కనీసంగా నాలుగైదు నెలల సమయం పడుతుంది. అలాంటప్పుడు సాగులెక్క తేల్చేదెప్పుడు? పెట్టుబడి సాయం ఇచ్చేదెప్పుడు? అన్న మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాగు లెక్క సరిగా చేయకపోతే, రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కించి.. అది రికార్డుల్లోకి రాకపోతే బాధ్యులు ఎవరు? అన్న ఇంకో ప్రశ్న తలెత్తుతున్నది.
వ్యవసాయం అనేది రోజువారీ పని. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంటే రైతు పొలం వద్దకు వెళ్లి సాగు పనులు చూసుకోవాలా? లేక ప్రభుత్వ ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరగాలా? కేసీఆర్‌కు ఈ సంగతి తెలుసు కనుకే ధరణి పోర్టల్ సాయంతో రైతుల వారీగా భూముల వివరాలను కంప్యూటరీకరించి, వారందరి అకౌంట్లు సేకరించి, రైతుబంధు రూపంలో ఏడాదికి రూ.15 వేల కోట్ల చొప్పున , దాదాపు రూ.లక్ష కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశారు. ఈ పైసల కోసం రైతులు ఏ దఫ్తర్కూ వెళ్లాల్సిన అవసరం లేకుండా, దస్కత్ పెట్టాల్సిన పనిలేకుండా, ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేశారు. దీన్ని పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ పంటలు వేసిన వారికే రైతుబంధు అనే పద్ధతి తెస్తామని చెప్తున్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం రైతులను మళ్లీ లంచాలు, దళారుల కూపంలోకి నెట్టబోతున్నది. లంచం ఇస్తే గానీ రైతుబంధు రాని పరిస్థితిని తీసుకొస్తున్నది. ఇందుకు ఉదాహరణ.. పంట సాగుచేసిన భూమికే రైతుబంధు ఇస్తామని చెప్తున్నది.
రిమోట్ సెన్సింగ్ సర్వేతో ఎలాగూ కచ్చితమైన పంట లెక్క తేలదు. దీంతో మళ్లీ గ్రామాల్లో వ్యవసాయ అధికారులో, లేక రెవెన్యూ అధికారులో లేక ఇతర అధికారులు రైతుల పంటల లెక్కలను నమోదుచేసి రికార్డు చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలోనే అవకతవకలకు, లంచాలకు ఆస్కారం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేయి తడిపితే కావాల్సినట్టు రికార్డులను మార్చేసే ప్రమాదం ఉంటుంది. పంట సాగుచేయనివారు సాగు చేసినట్టు నమోదుచేసి రైతుబంధుకు లైన్‌క్లియర్ చేస్తారు. రైతు పంట సాగుచేసినా, చేయి తడపకపోతే ఆ భూమిని రికార్డుల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులు రైతుబంధు రావాలంటే లంచం ముట్టచెప్పాల్సిన దుస్థితి ఏర్పడనున్నది. దీంతో పాటు రైతుబంధు కోసం మళ్లీ గ్రామ పంచాయతీ ఆఫీసుల ముందు దరఖాస్తులు పట్టుకొని క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడనున్నది. రిమోట్ సెన్సింగ్ సర్వేలో రైతు పంట నమోదు కాకపోతే… ‘అయ్యా.. సారూ! నేను పంట వేసుకున్నా, నాకు రైతుబంధు ఇవ్వండి’ అంటూ రైతులు అధికారుల ముందు మోకరిల్లాల్సిన దుస్థితి రానున్నది. ఇప్పటిదాకా దరఖాస్తు లేకుండా, సాగుతో సంబంధం లేకుండా రైతులు రైతుబంధు పొందగా, ఇకపై దరఖాస్తులు పెడుతూ, పంటసాగు లెక్కలు చూపుతూ ఆఫీసుల చూట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడనున్నది.
రైతుబంధులో మార్పులు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరేండ్లపాటు సక్కగా వస్తున్న రైతుబంధులో ఇప్పుడు సన్నాసి వేషాలెందుకు వేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. రైతుబంధు రూపంలో పెట్టుబడి సాయాన్ని అందించిన కేసీఆర్.. తమకు ఆర్థికంగా కొండంత భరోసా ఇచ్చారంటూ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన దిగిపోగానే రైతుబంధులో కోతలు పెడతారా? అని మండిపడుతున్నారు. కేసీఆర్ ఇచ్చింది పెట్టుబడి సాయం మాత్రమే కాదని, అది తమ బతుకు భరోసా అని స్పష్టం చేస్తున్నారు. అలాంటి రైతుబంధులో కోతలు పెడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. రాజకీయాలే ముఖ్యమని రైతుబంధులో మార్పులు చేస్తే.. కాంగ్రెస్ మార్పు కూడా ఖాయమని తేల్చిచెప్తున్నారు.
రాష్ట్ర విభజనకు ముందు, విభజన సమయంలో కూడా తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం రాదని విమర్శించారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న కేసీఆర్ తెలంగాణ రైతు దేశంలో ఎవరికీ తీసిపోడని నిరూపించటానికి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్రంలో చితికిపోయిన తెలంగాణ రైతు బతుకును మళ్లీ చిగురింపజేయడమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని సంచలన, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా తెలంగాణ ఏర్పడినప్పుడు పంటల సాగు విస్తీర్ణం 1.3 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పుడు ఏకంగా 2.4 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే కేసీఆర్ పాలనలో ఏకంగా కోటి ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఇక ధాన్యం ఉత్పత్తి 77 లక్షల టన్నుల నుంచి 2.6 కోట్ల టన్నులకు పెరిగింది. ఇలా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యవసాయరంగం పునరుజ్జీవం పొందింది.
పంట వేసిన వారికే రైతుబంధు ఇస్తామనే కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం.. వ్యవసాయ రంగాన్ని ఛిన్నాభిన్నం చేస్తుందన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ రైతుబంధుతో అయితే వ్యవసాయాన్ని స్థిరీకరించారో.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే రైతుబంధుతో సర్వనాశనం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే సాగునీళ్ల కరువు, కరెంట్ కోతలతో రైతు సతమతమవుతున్నాడు. ఇప్పుడు రైతుబంధులోనూ కోత పెడితే రైతుకు దెబ్బమీద దెబ్బ పడ్డట్టే. ఆర్థిక భారం మోయలేక రైతు మళ్లీ ఎవుసాన్ని మూలకు పెడతాడు. ఈ పరిణామం రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధ్వంసం ఒక్క వ్యవసాయరంగంతోనే ఆగిపోదని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
కేసీఆర్ పాలనలో రైతుబంధు సాయం రెండు పంటల్లోనూ సీజన్‌కు ముందుగానే అందేది. దీంతో పెట్టుబడి కష్టాలు తప్పేవి. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఇవ్వనంటోంది. ఈ యాసంగికి అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని ఆ సీజన్ ముగిసి పంటలు చేతికి వచ్చినా ఇంకా ఇవ్వలేదు. వచ్చే వానకాలం నుంచి కూడా సీజన్‌కు ముందే ఇవ్వబోమని, పంటలు చేతికొచ్చాక ఇస్తామని మంత్రులు అంటున్నారు. పెట్టుబడి సాయాన్ని పంటల సాగుకు ముందే ఇవ్వకపోతే మేము పెట్టుబడిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? వడ్డీకి తెచ్చుకుంటే మాకు అప్పులు మోపవుతాయి. ఇక దిగుబడి తగ్గినా, నష్టాలు వచ్చినా మిగిలేది అప్పులు భారమే. అందుకని రైతుబంధును సీజన్‌కు ముందుగానే ఇవ్వాలి. ఆ సాయంతో విత్తనాలు, ఎరువులు తెచ్చుకుంటాం.
– వీరబోయిన మోహనరావు, రైతు, అన్నపురెడ్డిపల్లి, భద్రాద్రి జిల్లా
పెట్టుబడి పెట్టేటప్పుడు ఇయ్యని డబ్బులు ఇప్పుడెందుకు? కేసీఆర్ ప్రభుత్వం ఎంత కష్టంలో ఉన్నా రైతుబంధు డబ్బులు ఎప్పుడూ ఆపలె. ఇప్పుడేమో భూములను కొలిసి డబ్బులు ఇస్తరట. ఇది సాధ్యమయ్యే పనేనా? మీదికెళ్లి కొలుసుడు.. సార్లు వచ్చి కొలుసుడు.. అటెంక డబ్బులు ఇచ్చుడు.. ఇది కుదిరేపని కాదు. సర్వేయర్ అచ్చి గొలుసు వేసి మన పొలం కొలుస్తనే సరిగా లెక్కకు అత్తలేదు. వీళ్లు మీదికెళ్లి కొలిస్తే అయ్యేపనేనా? వాళ్లు కొలిసి డబ్బులు ఇచ్చేటాళ్లకు మరో పంట కాలం అత్తది. పెట్టుబడి అప్పుడు డబ్బులు అందియ్యాలె. అప్పుడే ఆ పైసలు అక్కరకు అత్తయి. గవర్నమెంట్ మళ్లీ ఆలోచన చేయాలె. ఐదెకరాలకే ఇయ్యవడితివి. ఐదెకరాల్లో కూడా పంటలు వేసుకోనోడు ఎక్కడున్నడు?
– అన్నంనేని మహేందర్‌రావు, రైతు, గుడాడ్పల్లి, భూపాలపల్లి
రైతుబంధు చేయవట్టి, షావుకార్ల చుట్టూ తిరిగే తిప్పల తప్పింది. యాడాదికి రెండు పంటలు వరి సాగు చేస్తున్నం.. మునుపు వానకాలం వచ్చిందంటే వ్యవసాయం పనులు మొదలు పెట్టేది. అంతకు ముందే షావుకార్లు, మిత్తిలకు ఇచ్చే ఆసాముల దగ్గరికి పోయి పంట పెట్టుబడి కోసం పైసలు అడిగేది. వాళ్లు వారం పది రోజులు తిప్పించుకొని పైసలు ఇస్తే ఇచ్చేది.. వాళ్లు ఇవ్వకుంటే వేరే వాళ్లను చూసుకొని ఆళ్ల చుట్టూ తిరిగేది. కొందరు పెట్టుబడిదారులు, ఆసాములైతే పండించిన పంట తమకే అమ్మాలె.. అంటూ తిరకాసు పెట్టేది.. రైతుబంధు పుణ్యమా అని ఆ తిప్పలు తప్పినయ్. సరిగ్గా సమయానికి పైసలు బ్యాంకుల పడుతున్నయి.
పెట్టుబడి సాయం, 24 గంటల కరెంట్, పండిన వడ్లకు మద్దతు ధర కల్పించి ఊళ్లెనే కొనేందుకు ఐకేపీ సెంటర్ పెట్టుడు తోటి మా పరిస్థితి కొంచెం మంచిగైంది. నాలుగు పైసలు కండ్ల సూత్తున్నం.. రైతులకు మునుపు ఎవళ్లు ఇంత మంచి సౌలత్ చేయలేదు. కేసీఆర్ రైతులకు అన్ని మంచి పనులు చేసిన్రు. అయితే, కాంగ్రెస్ సర్కారు వచ్చినంక పరిస్థితి మారిపోయింది. రైతుబంధు విషయంల ప్రభుత్వం మాటిమాటికీ తప్పుడు సమాచారం ఇచ్చింది.. పంట కాలం ముగిసి, పంట చేతికి వచ్చి అమ్ముకున్న తర్వాత రైతుబంధు ఇస్తం అంటున్నరు.. క్వింటాల్ ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినంక దాన్ని మరిచింది. రైతుబంధు ఐదెకరాల వరకే ఇస్తామంటోంది. రైతుబంధు సాయం పంట వేసే ముందే అందించాలి. కోతల సమయంలో ఇస్తే అది పెట్టుబడి సాయం ఎలా అవుతుంది? పెట్టుబడికి అప్పు చేయాల్సి వస్తుంది.
– కొమ్ముల శేఖర్ రెడ్డి, కొండ్రికర్ల, మెట్పల్లి మండలం, జగిత్యాల జిల్లా
సీఎం, మంత్రులు ఒకసారి రైతుబంధు అని.. మరోసారి రైతుభరోసా అంటరు. ఎన్నికల ముందు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు వేస్తం అన్నరు. ఎన్నికలప్పుడు రైతుబంధు ఆపిండ్రు. ఇప్పుడైతే ఎకరానికి ఐదువేలే వస్తయ్.. మేము వచ్చినంక ఏడున్నర వేలు ఇస్తం అన్నరు. అధికారంలోకి వచ్చినంక రైతుబంధు ఇవ్వనేలేదు. విమర్శలు వచ్చినంక రైతుబంధు వేసుడు మొదలువెట్టిండ్రు. వచ్చేసారి నుంచి ఐదెకరాల లోపు ఉన్నవాళ్లకే వేస్తం అంటున్నరు. మళ్లా ఈసారి అందరికీ వేస్తున్నం అన్నరు. అరెకరం నుంచి మొదలువెట్టి ఐదెకరాల వారికి ముందు వేస్తం అన్నరు.
ఐదెకరాల వాళ్లకు కూడా సరిగా రైతుబంధు ఇవ్వలేదు. అసలు రైతుబంధు.. రైతుభరోసాపై ప్రభుత్వం, సీఎం విధానం ఏమిటో తెలుస్తలేదు. పంట వేసినం.. పండించినం.. పంట కోసినం.. కల్లం చేసినం.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసినం.. గిప్పుడు రైతుబంధు ఇచ్చుడా? పంట పెట్టుబడికి ఇచ్చే సాయం.. రైతుబంధు. రైతుకు ఉత్తిగనే ఇచ్చే ఇనాం కాదు. ఈ విషయాన్ని ముందుగా సర్కారు గుర్తించాలి. మా కుటుంబానికి 30 ఎకరాల భూమి ఉన్నది. మా నాన్న పేరు మీద 8 ఎకరాలు ఉన్నది. అందరం సమిష్టిగానే వ్యవసాయం చేస్తం. మా కుటుంబానికి వ్యవసాయం తప్ప వేరేది తెల్వదు. ఇప్పుడు ప్రభుత్వం ఐదెకరాలలోపు ఉన్నవారికే రైతు భరోసా అంటూ ప్రకటనలు చేస్తాంది. ఇది ఎంత వరకు కరెక్ట్.
– కేతిరెడ్డి తిరుపతిరెడ్డి, రైతు, రామన్నపేట, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా
రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మా బతుకులతో ఆటలాడుతున్నది. పంట సాగు చేసేటప్పుడు ఇయ్యాల్సిన రైతుబంధు ఇవ్వకుండా.. రైతులను అప్పుల పాలుచేసింది. మూడెకరాలున్న రైతు కూడా రైతుబంధు ఎప్పుడు పడుతుందా? అని ఎదురుచూడాల్సి వస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం రైతులందరికీ సీజన్‌కు ముందే రైతుబంధు పైసలను బ్యాంకుఖాతాల్లో జమచేసేది. అందుకే అప్పులు లేకుండా సాగు చేసుకున్నం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుబంధు కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. పంట వేసేటప్పుడు కాకుండా పంట కోతలయ్యాక ఇస్తే ఏం లాభం? పంట పెట్టుబడికి చేసిన అప్పులకు మిత్తి కట్టేందుకే సరిపోతది. గత ప్రభుత్వంలా పంటలు సాగుచేసే ముందే రైతుబంధు ఇయ్యాలి.
– హతీరాంనాయక్, రైతు, నాన్యాతండా, మిర్యాలగూడ మండలం, నల్లగొండ జిల్లా
సర్కారు మారితే మార్పు వస్తుందంటే ఎంతో ఆశపడ్డం. ఎకరాన రూ.10 వేలు ఇస్తున్న కేసీఆర్ కంటే మరో రూ.5 వేలు ఇస్తమంటే నమ్మి మోసపోయినం. రాక మందు ఓమాట అధికారంలోకి వచ్చినంక మరో మాట మాట్లాడుతున్నరు. ఇప్పుడేమో ఐదెకరాలకే రైతుబంధు అంటున్నరు. కొర్రీలు పెట్టి రైతులను గోసపుచ్చుకుంటున్రు. రానురాను ఉన్న దానికి కూడా ఇత్తరో? లేదో? వీళ్లను నమ్మితే ఎవుసం అమ్ముకునుడే అయతదని భయమేస్తంది. ఇప్పటి వరకు ఐదెకరాలున్న మాతోటి రైతులకు ఇంకా పైసలు బ్యాంకుల పడలేదు. గింజలు సెంటర్లకు తీసుకుని పోయి అమ్ముకునే యాళ్లయినా నయా పైసా ఇయ్యలేనోళ్లు ముందు ముందు ఇత్తరన్న నమ్మకమేంది?
– భాగ్యలక్ష్మి, మహిళా రైతు, సిరిసిల్ల అర్బన్ మండలం