దేశంలో ఎవరో ఒక మహా నాయకుడు ఎప్పుడూ మార్పు కోరుతూనే వచ్చారు. ముఖ్యంగా సమాజంలోని అసమానతలు రూపుమాపాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరారు. అంతేకాదు, అన్ని కులాల, మతాలవాళ్లు బాగుపడాలని, అంటరానితనాన్ని పూర్తిగా అంతమొందించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆయన ఎప్పటికప్పుడు తన భావాలను ప్రకటిస్తూనే వచ్చారు. అందుకే దేశంలోని అన్నివర్గాలు సమానత్వంతో ముందుకుసాగేలా అనేక అంశాలను ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు.
Congress | స్వాతంత్య్రానంతరం మన దేశంలో ఎన్నో ప్రభుత్వాలు కొలువుదీరినా ఎక్కడకూడా సంపూర్ణమైన మార్పు జరగలేదు. ప్రభుత్వాలు తమ రాజకీయ పార్టీలు బాగుపడటానికి, మళ్లీ మళ్లీ అధికారంలోకి రావడానికి మాత్ర మే రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా వాడుకున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, ఆయన పేరును వాడుకున్నాయే తప్ప, ఆయన ఆశయాల సాధన కోసం ఏనాడూ కృషిచేయలేదు.
జ్యోతిబా పూలే లాంటి నాయకులు ప్రతి పౌరుడు చదువుకోవాల ని చెప్పారు. గ్రామస్థాయి నుంచి సమూల మార్పు రావాలని కాంక్షించారు. ధనవంతులు, జాగీర్దార్ల వద్ద ఉన్న భూములను పేద లకు పంచాలనే సదుద్దేశంతో వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఏ ఉద్యమమైనా దాని అంతిమ లక్ష్యం ఒక్కటే. సమాజంలో మార్పు రావాలి, అసమానతలు తొలగిపోవాలి, అందరికీ విద్య అందాలి, అందరూ సమున్నతంగా బతుకాలన్నదే ఆ ఉద్యమ నాయకుల సంకల్పం. ఆ విధంగానే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా తెలంగాణ ప్రాంతం బాగుపడాలి, తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నారు. మార్పు కోసం తపనపడ్డారు.
ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. ఆయన అంతటితోనే ఆగిపోలేదు. పోరాడి సాధించిన తెలంగాణలో, రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నారు. అందరికీ విద్య, వైద్యం అందుబాటులో ఉంచాలనుకున్నారు. అందుకే ఆయన అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి పేద, బడుగు, బలహీన, దళిత వర్గాల బతుకుల బాగు కోసం పరితపించారు. తనవంతు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ప్రజలు కూడా ఆ ప్రయత్నాన్ని స్వాగతించారు, అందులో భాగస్వాములయ్యారు.
కానీ, ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ నాలుగు నెలల పాలనతోనే ప్రజలు విసుగెత్తిపోయారు. మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే మారిపోతే బాగుం డునని ప్రజలు కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న నాకు ప్రజల ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. నాడు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి నాయకులు కదిలితే, ఇప్పుడు నాయకులను మార్చడానికి ప్రజల్లో మార్పు రావడం నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ‘మాకు ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలని, ఈ ముఖ్యమంత్రి అలా లేడని’ ప్రజలు నిర్మొహమాటంగా చెప్తున్నారు.
‘మా బతుకుల్లో వెలుగులు నింపాలంటే కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమవుతుంది’ అనే మాట ఇప్పుడు గ్రామాల్లో అడుగడుగునా వినిపిస్తున్నది. మళ్లీ కేసీఆర్ రావాలి, వస్తేనే తమ బతుకులు బాగుపడుతాయని ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మార్పు వస్తుందనడంలో సందేహం లేదు.
అబద్ధాలనే పునాదులుగా చేసుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ పూటకో అబద్ధమాడుతున్నది. రైతుబంధు వేస్తున్నట్టే చేసిన రేవంత్‌రెడ్డి.. మరుసటి రోజే మాటమార్చి ఎలక్షన్ కమిషన్ అడ్డు వస్తున్నదని చెప్తూ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారు. అబద్ధాలతోనే సహవాసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ అలవిగాని హామీలను చూసి మోసపోయిన తెలంగాణ మళ్లీ చైతన్యవంతమైంది. కేసీఆర్ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నది. ఇది యావత్ రాష్ర్టానికి శుభ పరిణామం.
(వ్యాసకర్త: మాజీ ఎమ్మెల్యే)
– గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి