Shefali Shah | లింగ సమానత్వం, సామాజిక బాధ్యతలపై ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ షా చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఒక ఈవెంట్లో భాగంగా షెఫాలీ మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా ఉండటం అనేది ఏదో ఒక పట్టుదలతో సాధించాల్సిన ‘ఎజెండా’ కాదని, మనకు నచ్చినట్లుగా, సౌకర్యంగా జీవించడమే అసలైన సమానత్వమని షెఫాలీ షా అన్నారు. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడటం చాలా కీలకమని పేర్కొన్న ఆమె, ముఖ్యంగా చదువు మరియు ఆర్థిక స్వతంత్రత ఉంటేనే సమాజంలో మహిళలకు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని నొక్కి చెప్పారు.
పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ.. ఆ బాధ్యత కేవలం తల్లులదే కాదని, ఇందులో తండ్రుల పాత్ర కూడా సమానంగా ఉండాలని ఆమె అన్నారు. తండ్రి ఇంట్లోని మహిళలతో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసే పిల్లలు ప్రవర్తనను నేర్చుకుంటారని, అందుకే అబ్బాయిలను చిన్నప్పటి నుంచే మహిళల పట్ల గౌరవంగా ఉండేలా పెంచాలని ఆమె సూచించారు. మహిళల భద్రత అనేది కేవలం చట్టాల ద్వారానే కాకుండా, ఇంట్లోని సంస్కృతి నుంచే ప్రారంభం కావాలని ఆమె కోరారు. ప్రస్తుతం ‘ఢిల్లీ క్రైమ్’, ‘డార్లింగ్స్’ వంటి సక్సెస్లతో కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న షెఫాలీ షా, త్వరలో ‘లవ్ అండ్ వార్’ వంటి భారీ చిత్రంలో నటిస్తుంది.