Trisha | దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్ మరోసారి తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. నటనతో పాటు తన వ్యక్తిత్వంతోనూ ప్రత్యేక గుర్తింపు పొందిన త్రిష పెళ్లి, విడాకులు, సహజీవనం వంటి అంశాలపై గతంలో వెల్లడించిన అభిప్రాయాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో “మీ పెళ్లి ఎప్పుడు?” అనే ప్రశ్నకు త్రిష స్పష్టమైన సమాధానం ఇచ్చారు. “చాలామంది నన్ను పెళ్లి గురించి అడుగుతుంటారు. కానీ నాకు ఒకటే సమాధానం ఉంది. నాకు నచ్చిన, సరైన వ్యక్తి దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే పెళ్లి జరగకపోయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు,” అని ఆమె తెలిపారు.
త్రిష వ్యాఖ్యల్లో స్పష్టత, ఆత్మవిశ్వాసం కనిపించాయి. పెళ్లి అనేది కేవలం సమాజం కోసం తీసుకునే నిర్ణయం కాదని, జీవితాంతం కలిసి జీవించగలమనే నమ్మకం కలిగినప్పుడే ఆ అడుగు వేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. “నేను పెళ్లి చేసుకుంటే అది విడాకుల వరకు వెళ్లకూడదని భావిస్తున్నాను. అందుకే తొందరపడి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోను,” అని త్రిష వివరించారు. తన స్నేహితుల్లో చాలామంది ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని బాధపడుతున్నారని, అలాంటి జీవితం తనకు వద్దని ఆమె స్పష్టం చేశారు.ఇష్టం లేని వ్యక్తితో కలిసి నరకం అనుభవించడం కంటే ఒంటరిగా ఉండటం మేలని త్రిష అభిప్రాయపడ్డారు. ప్రేమలో పడటం కంటే తన జీవితాన్ని పంచుకోగలిగే మంచి భాగస్వామి కావాలని, తనకు నచ్చిన వ్యక్తితో సంతోషంగా జీవించడమే తన లక్ష్యమని తెలిపారు.
త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆమె అభిప్రాయాలకు కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు వివిధ కోణాల్లో స్పందిస్తున్నారు. అయితే పెళ్లి విషయంలో సమాజపు ఒత్తిడికి లోనుకాకుండా, తన నిర్ణయాన్ని తాను తీసుకోవాలనే సందేశాన్ని త్రిష స్పష్టంగా ఇచ్చారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే, త్రిష ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కెరీర్ పరంగా వరుస అవకాశాలతో దూసుకుపోతూనే, వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పాలి. కాగా, ఈ మధ్య విజయ్ డైవర్స్ ఇష్యూలో త్రిష పేరు బయటకు రావడం హాట్ టాపిక్ అయిన విషయం విదితమే.