Hyderabad : హైదరాబాద్‌లోని ప్రముఖ నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవం అంశంపై వివాదం మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ను యూనివర్సిటీ ఆహ్వానించింది. అయితే, సీజేఐని ఆహ్వానించడాన్ని ఇక్కడి విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ వీసీకి 450 మంది విద్యార్థులు లేఖ కూడా రాశారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవం ఇటీవల జరగాల్సి ఉంది. 2026లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న లా విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేసే స్నాతకోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడానికి యూనివర్సిటీ ఏర్పాట్లు చేసింది.
దీనికి సీజేఐ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా యూనివర్సిటీ వర్గాలు గత నెలలో ఆహ్వానించాయి. అయితే, స్నాతకోత్సవానికి ఆయనను ఆహ్వానించడాన్ని యూనివర్సిటీకి చెందిన అత్యధిక మంది విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణం గత నెలలో జరిగిన పరిణామాలు. జూలై 20న సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన సందర్భంగా అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. వాటికి సంబంధించి సుప్రీంకోర్టులో అనేక కేసులు దాఖలయ్యాయి. ఈ కేసుల విషయంలో సీజేఐ వ్యవహరించిన తీరును నల్సార్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థుల తరఫు వాదనల్ని సీజేఐ సరిగ్గా పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆయనను ఆహ్వానించకూడదని నల్సార్ విద్యార్థులు నిర్ణయించారు. ఆయన చేతుల మీదుగా డిగ్రీ పట్టాలు తీసుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై 450 మంది విద్యార్థులు.. తమ సంతకాలతో యూనివర్సిటీ వీసీకి లేఖ రాశారు.
స్నాతకోత్సవానికి సీజేఐని ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని వారు లేఖలో కోరారు. ఆయన రావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. వీసీ సహా అధికారులతో ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధమన్నారు. వీరి లేఖ కారణంగానే ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీజేఐని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తే ఆందోళనలు, ఘర్షణ తలెత్తే అవకాశం కూడా ఉందని సమాచారం. అయితే, స్నాతకోత్సవానికి సంబంధించిన డేట్ ఇంకా ఖరారు కాలేదనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇక, ఈ అంశంపై ఇప్పటివరకు నల్సార్ యూనివర్సిటీ అధికారికంగా స్పందించలేదు.