న్యూయార్క్: అమెరికా కీలక బిల్లు(US Bill)ను పాస్ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు చట్టసభ ప్రతినిధుల సభలో ఆమోదం దక్కింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 262, వ్యతిరేకంగా 159 మంది ఓటేశారు. పాసైన బిల్లు ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్‌కు ఇప్పుడు మరింత శక్తి తోడైనట్లు అయ్యింది. దక్షిణ కరోలినా దివంగత సేనేటర్ లిండ్సే గ్రహం గౌరవార్ధం ఈ బిల్లును రూపొందించారు. సుమారు ఏడాది పాటు ఆ బిల్లుపై చర్చలు జరిగాయి.
రష్యాపై ఆర్థిక ఆంక్షల బిల్లుకు ఆమోదం దక్కడం అంటే, ఆ ప్రభావం భారత్, చైనా దేశాలపై పడే అవకాశాలు ఉన్నాయి. రష్యా వద్ద ఇంధనం ఖరీదు చేస్తున్న దేశాలపై వంద శాతం సుంకం విధించనున్నట్లు గతంలో ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రష్యా ఆంక్షల బిల్లుకు ఆమోదం దక్కింది కాబట్టి, భారత్‌తో పాటు చైనాపై అమెరికా అధ్యక్షుడు తన అధికారాన్ని ప్రదర్శించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సభలో డెమోక్రాట్లు ఆ బిల్లును వ్యతిరేకించారు. ట్రంప్ అధికారాలూ ఎక్కువైపోతాయని ఆరోపించారు.
రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని సరఫరా చేసుకుంటున్న దేశాలపై 100 శాతం టారిఫ్ విధించే అవకాశాలు ఉన్నాయి. ఒక 15 శాతం కన్నా తక్కువ స్థాయిలో రష్యా సహజ వాయువులను దిగుమతి చేసుకునే దేశాలపై తక్కువ సుంకం విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి భారత్ ఎక్కువగానే ఇంధానాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అమెరికా సభలో పాసైన తాజా బిల్లుతో ఇండియాకు భారీ టారిఫ్ స్ట్రోక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.