Donald Trump | సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ప్రతీకారానికి దిగకపోవడమే మంచిదని ఇరాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ప్రతిదాడులు చేస్తే మరింత తీవ్రంగా బదులిస్తామని తెలిపారు. కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేస్తామని హెచ్చరించారు. ఎవరూ ఊహించని రీతిలో దాడులు ఉంటాయని అన్నారు.
ఖమేనీ మృతిపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాడులకు పాల్పడిన వారిపై కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికాపై తీవ్రంగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా హద్దు మీరిందని.. మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేసింది. అమెరికా మిలటరీ స్థావరాలపై భీకరదాడులు తప్పవని హెచ్చరించింది. అన్నట్లుగానే గంటల వ్యవధిలోనే ఇరాన్ ప్రతీకార చర్యల్ని ప్రారంభించింది. పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్కుచెందిన ఐఆర్జీసీ దళాలు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేపట్టాయి. అలాగే ఇజ్రాయెల్‌పై కూడా క్షిపణులతో విరుచుకుపడుతోంది. దుబాయి, దోహాలోని యూఎస్ స్థావరాలు, లెబనాన్‌లోని అమెరికా ఎంబసీపైనా దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తీవ్రంగా స్పందించారు.