Jay Shah | ముంబై: ఐపీఎల్లో గతేడాది ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన సర్వత్రా చర్చనీయాంశమవుతున్న వేళ దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రూల్ శాశ్వతం కాదని, టెస్టింగ్ కోసమే దానిని తీసుకొచ్చామని షా అన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక, టీమిండియా కోచ్ వంటి విషయాలపై షా మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను టెస్టింగ్ కోసమే తీసుకొచ్చాం. దానివల్ల మరో ఇద్దరు భారత ఆటగాళ్లకు తుది జట్టులో ఆడే అవకాశం దక్కుతుంది కదా.
ఒకవేళ దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుటాం’ అని షా చెప్పాడు. 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ వేదికను భారత్‌కు మార్చేందుకు గాను ఐసీసీతో చర్చిస్తున్నామని, ఈ విషయంలో వాళ్లూ సానుకూలంగా స్పందించారని తెలిపాడు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులను ఇషాన్, శ్రేయస్ కోల్పోవడంలో తన పాత్ర ఏమీలేదని, అది అగార్కర్ నిర్ణయమని వెల్లడించాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి వచ్చే జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని జై షా తెలిపాడు.