హైదరాబాద్, మార్చి 11,(నమస్తే తెలంగాణ): టీఎస్‌సెట్ ఫలితాలు వచ్చిన సంవత్సరం తర్వాత కీలో తప్పులున్నాయని పిటిషన్ వేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఫలితాలను నిలిపివేయాలనే పిటిషన్‌పై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. 2024 సెప్టెంబర్‌లో జరిగిన సెట్ కీలో 29 ప్రశ్నలు తప్పు ఉండగా ఫలితాలను నిలిపివేయాలంటూ వీ శరణ్య సహా నలుగురు దాఖలు చేసిన పిటిషన్లను గతంలో విచారించిన సింగిల్ జడ్జి ఉత్తర్వుల జారీకి నిరాకరించారు. గడువులోగా అభ్యంతరాలు తెలపకపోవడంతో నియామక ప్రక్రియను నిలిపివేయబోమన్నారు. దీంతో వారు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది. ఓయూ న్యాయవాది వాదిస్తూ, 2024 సెప్టెంబర్ 23న ప్రాథమిక కీ డుదల చేసి అక్టోబరు నుంచి 11 దాకా అభ్యంతరాలను తెలిపేందుకు గడువు ఇచ్చినట్టు వివరించారు. అందిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించాక నవంబరు 16న తుది కీ విడుదలైందని చెప్పారు. వాదనలను పరిగణనలోకి తీసుకొన్న డివిజన్ బెంచ్ అప్పీల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది.