అలంపూర్, ఆగస్టు 10 : ‘అన్నీ ఉ న్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు.. నదిలో నిండు గా నీళ్లు ఉన్నా ఎత్తిపోసుకునే పరిస్థితి లేదు. సీజన్లో కృష్ణానదిలో నీళ్లు లేనపుడు ఇబ్బందే, నీళ్లు ఉన్నా తోడుకు నే పరిస్థతులు లేకపోవడంతో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని పంటలను కాపాడి అన్నదాతలను ఆదుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో కృష్ణానది తీరం వెంబడి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇరిగేషన్ అవసరాల కో సం రైతుల కోరిక మేరకు బీఆర్ఎస్ హయాంలో రూ. కోట్లు ఖర్చు చేసి ఎత్తిపోతల పథకాలను నిర్మించింది. దీంతో రైతులు వర్షాలపై ఆధారపడకుండా పసిడి పంటలు పండించుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ నాయకులు ఎత్తిపోతల పథకాలను పట్టించుకోవడం లేదు. వర్షాలు కూడా సరైన సమయంలో పడటం లేదు. దీంతో అన్నదాతలు సాగు చేసిన పంటలకు చుక్క నీరు అందక విలవిలలాడుతున్నారు. అదృష్టవశాత్తు ఎగువ ప్రాం తాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణ నదికి వరద గత వారం రోజులుగా నీరు వచ్చి చేరుతుంది. నదిలో పారుతున్న నీటినైన తోడుకొని పంటలను రక్షించుకుందామనుకుంటే ఎత్తిపోతల పథకాల నిర్వహణ లోపం, అధికారులు నిర్లక్ష్యం కారణంగా అక్కడి లక్షల విలువ చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురికావడంతో అన్నదాతల పరిస్థితి మూలిగే నక్కపై తాటి కాయ పడ్డైట్టు అయ్యింది.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పంట పొలాల్లోని ఎత్తిపోతల పథకాలనే టార్గెట్ చేసి అక్కడ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల ఆయిల్, అందులోని కాపర్ తీగలను, విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. హైపవర్ కరెంట్ ఉన్న విద్యుత్ వైర్లను సైతం కట్ చేసి విద్యుత్ సరఫరా నిలిపి వేసి చోరీకి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. జోగుళాంబ గద్వాల- వనపర్తి జిల్లాల్లో కృష్ణా నది రెండు వైపుల తీర ప్రాంతాల్లో సుమారుగా 10 నుంచి ఇరవై ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశా రు. ఇటీవల కాలంలో అలంపూర్ నియోజకవర్గంలోని క్యాతూరు-1, 2, ఊట్కూరు, బుక్కాపురం, గుందిమల్లలోనూ నది ఆవలి ప్రాంతం చిన్నమరూర్, పెద్దమారూర్, గ్రామాల్లో ఉన్న సుమారు రెండు, మూడు ఎత్తిపోతల పథకాల్లో కూడా ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురైనట్టు తెలుస్తుంది. సుమారుగా ఆరు ఎత్తిపోతల పథకాల్లో చోరీ జరిగినట్టు తెలుస్తుంది.
ఇంతలా జరుగుతున్న ప్రభుత్వం, పాలకులు ,అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు వేసిన తర్వాత సరైన వర్షాలు పడలేదు, నదిలో నీరు నిండు కుండాడలా ఉన్నా ఎత్తిపోసుకునే పరిస్థతి లేదని ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు ఆందోళ నకు గురవుతున్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణ కమిటీలు ఉన్నప్పటికీ పర్యవేక్షణ లోపం కారణంగా వస్తువులు చోరీకి గురవుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రైవేట్ ఆస్తులకే కాదు, ప్రభుత్వ ఆస్తులకు కూడా భద్రత కరువైందని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ప్రభుత్వ అధికారులు, పాలకులు నుంచి సరైన స్పం దన రాకపోవడంతో ఊట్కూరు ఎత్తిపోతల పథకం కమిటీ చైర్మన్ నర్సన్ గౌడ్ సొంత ఖర్చులతో హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫ్మార్లు అద్దెకు తెచ్చి పథకంకు అమర్చి మోటర్లు ఆన్ చేసి రైతులకు సాగు నీరందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా పంపుల వద్ద కూడా రైతులు వారి సొంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టారు. రెండ్రోజుల్లో నీటిని విడుదల చేయనున్నట్టు వివరించారు. దాదాపుగా మిగతా ఎత్తిపోతల వద్ద కూడా రైతులే స్వయంగా మరమ్మతులు చేసుకొని నీరు పారించుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన వారి కోసం దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
ఆయకట్టు కింద సాగుచేసిన పంటలు ఎండిపోకుండా రైతులు నష్టపోకుండా సాగునీరం దిస్తాం. ట్రాన్స్ ఫార్మర్లు కొత్తవి రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే సొంత డబ్బులతో ట్రాన్స్ ఫార్మర్లు హైదరాబాద్ నుంచి అద్దెకు తెచ్చి ప్రస్తుతానికి ఈ సీజన్ ఎల్లగొడతాం. ఇరిగేషన్ అదికారులు, అధికార పార్టీ నాయకులతో చర్చించి వచ్చే సీజన్ అన్ని సిద్ధం చేస్తాం.
– నర్సన్గౌడ్, చైర్మన్, ఊట్కూరు ఎత్తిపోతల పథకం కమిటీ