Plane Crash | డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. క్వాంగో ప్రావిన్స్‌లోని కెంజ్ ప్రాంతంలో విమానం కుప్పకూలడంతో ఇద్దరు సీనియర్ సైనికాధికారులు సహా 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని కాంగో సైన్యం శుక్రవారం వెల్లడించింది.
మృతుల్లో మిలిటరీ కోర్టు అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఉన్నారని సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంగే తెలిపారు. వారిద్దరితో పాటు మరో 12 మంది సైనిక ప్రతినిధులు, సిబ్బంది కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
విమానం నైరుతి కాంగోలోని కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు తిరిగి వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కెంజ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో విమానం కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. విమానం కుప్పకూలిన ప్రదేశంలో పలువురు మృతదేహాలు కాలిపోయిన స్థితిలో లభించాయి. నేలపై ఉన్న స్థానికుల్లో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు కాంగో సైన్యం ప్రకటించింది.
Congo Military plane crash in kenge, killing 13 people including three army officers.
The plane was travelling to the capital, Kinshasa, from the southwestern city of Kikwit when it experienced a technical problem and attempted to land in #Kenge.#congo #planecrash pic.twitter.com/8EgXd0xYDQ
— Ravinder Singh (@ravindraJourno) September 25, 2026
కాంగోలో చాలాకాలంగా భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తూర్పు కాంగోలోని పలు తిరుగుబాటు గ్రూపులతో సైన్యం పోరాడుతోంది. రువాండా మద్దతు ఉన్న ఎం23తోపాటు పలు తిరుగుబాటు గ్రూపులతో కాంగో సైన్యం పోరాడుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో ఈ విమాన ప్రమాదంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.