Sawan Barwal | ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల మారథాన్‌లో రజత పతకం సాధించి.. ఈ విభాగంలో భారత్ 44 ఏండ్ల నిరీక్షణకు తెరదించాడు. జపాన్‌లోని నాగోయాలో శనివారం జరిగిన ఫైనల్లో బర్వాల్ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. దీంతో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో పాటు కొత్త జాతీయ రికార్డును నమోదు చేశాడు.
మారథాన్‌లో భారత్ చివరిసారిగా 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో పతకం సాధించింది. అప్పట్లో హోసూర్ కుక్కప్ప సీతారామ కాంస్య పతకం గెలిచారు. తాజాగా బర్వాల్ రజతం సాధించడంతో 44 ఏండ్ల తర్వాత భారత్‌కు ఈ విభాగంలో మళ్లీ పతకం దక్కింది.
సావన్ బర్వాల్ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లా జోగిందర్నగర్ ప్రాంతానికి చెందినవాడు. చిన్నతనంలో ప్రత్యేకంగా రన్నర్ కావాలనే లక్ష్యంతో క్రీడల్లోకి రాలేదు. పాఠశాల స్థాయిలో పరుగుపందేల్లో పాల్గొంటూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించడంతో అథ్లెటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. 2019లో భారత సైన్యంలో చేరిన తర్వాత క్రీడను వృత్తిగా కొనసాగించాడు.
మారథాన్‌కు మారకముందు బర్వాల్ ఎక్కువగా ట్రాక్ ఈవెంట్లలోనే పోటీపడ్డాడు. 5,000 మీటర్లు, 10,000 మీటర్లతోపాటు ఇతర దీర్ఘదూర పరుగుల్లో పాల్గొన్నాడు. 2025 నేషనల్ గేమ్స్‌లో 5,000, 10,000 మీటర్లలో స్వర్ణాలు సాధించడంతో పాటు మీట్ రికార్డులు నమోదు చేశారు.
2022 ఆసియా క్రీడల తర్వాత మారథాన్‌లో ప్రయత్నించాలని బర్వాల్ ఆలోచించాడు. కోచ్‌లు, సీనియర్ రన్నర్లతో చర్చల అనంతరం దీర్ఘదూర రేసుకు శిక్షణ ప్రారంభించాడు. గాయం కారణంగా తొలి ప్రయత్నం ఆలస్యమైనా.. 2026లో నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా మారథాన్ కోసం సిద్ధమయ్యాడు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్ మారథాన్ ఆయనకు తొలి అధికారిక మారథాన్. అక్కడ 2:11:58 టైమింగ్‌తో రేసు పూర్తి చేసి 1978లో శివనాథ్ సింగ్ నెలకొల్పిన 2:12:00 జాతీయ రికార్డును 48 ఏండ్ల తర్వాత బద్దలు కొట్టాడు.
రోటర్‌డామ్ తర్వాత బర్వాల్ తన రెండో పోటీ మారథాన్‌గా ఆసియా క్రీడల బరిలోకి దిగాడు. నాగోయాలో జరిగిన రేసులో 2:11:37తో రజతం సాధించాడు. ఈ రేసులో జపాన్‌కు చెందిన ఇచిటాకా యమషితా 2:10:49తో స్వర్ణం, చైనాకు చెందిన పేయూ ఫెంగ్ 2:12:13తో కాంస్యం సాధించారు.