హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం. హామీల అమల్లో నిర్లక్ష్యం. కమిటీలు.. చర్చల పేరిట కాలయాపన. వెరసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి రాజుకుంటున్నది. ఈ అసంతృప్తి క్రమంగా ఉద్యమ రూపం దాల్చుతున్నది. సర్కార్ తీరును నిరసిస్తూ ఒక్కొక్కటిగా సంఘాలు పోరుబాట పడుతున్నాయి. ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. సర్కార్‌పై జంగ్కు రెడీ అవుతున్నాయి.
డిమాండ్ల పరిష్కారానికి ఇప్పటికే పలు సంఘాలు భారీ ఆందోళనలతో హోరెత్తించాయి. తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) జనజాగరణ యాత్రను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది. సీపీఎస్ రద్దు, పాత పింఛన్ అమలు, 2023 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర నిర్వహించింది. ఈ నెల 23న వేలాది మందితో ‘చలో హైదరాబాద్’ నిర్వహించనున్నది. డీఏల విడుదల, పీఆర్సీ సాధన, పెండింగ్ డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆగస్టు 29న ‘చలో హైదరాబాద్’ తలపెట్టింది. 51% పీఆర్సీ సాధనకు పీఆర్టీయూ టీఎస్ సెప్టెంబర్ 1న ‘చలో హైదరాబాద్’ నిర్వహించనున్నది. ఇప్పటికే ఈ నెల 1న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఇందిరాపార్క్‌లో మహాధర్నా నిర్వహించింది. ఈ నెల 31లోపు సమస్యలు పరిష్కరించాలని సర్కార్‌కు అల్టిమేటం జారీచేసింది. ఈ నెల 7న పెన్షనర్స్ జేఏసీ ‘చలో హైదరాబాద్’ పేరిట ధర్నా నిర్వహించింది.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మూడేండ్లుగా పీఆర్సీ పత్తాలేకుండా పోయింది. రికార్డుస్థాయిలో 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. హెల్త్‌కార్డుల పేరిట ప్రతి నెలా రూ.1.5% మూలవేతనంలో కోత పెడుతున్నారు. అయినా పూర్తిస్తాయి వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వరుస ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ ఉద్యమాలన్నీ ప్రభుత్వానికి సవాల్‌గా మారుతున్నాయి.
పీఆర్సీ సాధన లక్ష్యంతో సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహించబోతున్నాం. 51% ఫిట్మెంట్ సాధించేందుకు 51వేల మంది టీచర్లతో ఈ సభను తలపెట్టాం. ప్రభుత్వం మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించకపోతే భవిష్యత్తు కార్యాచరణకు పూనుకుంటం. ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడబోం.
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ ధోరణిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. లాబీయింగ్‌తో కాకుండా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ద్వారా నాలుగు దశల ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. టీచర్లంతా ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి.