హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పలు యూనియన్ల మధ్య పొత్తు వికసిస్తున్నది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) మధ్య పొత్తు కుదిరినట్టు ఈయూ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న శుక్రవారం తెలిపారు. అక్టోబర్ 9న జరిగే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐక్య కూటమిగా పోటీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు.
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించి తమ కూటమికి ఓటు వేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్టు చెప్పారు. టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్), తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)లు ఒక కూటమిగా పోటీ చేస్తున్నట్టు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ తెలంగాణ కమిటీ శుక్రవారం తెలిపింది.
గందరగోళంలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ
కాంగ్రెస్‌కు అనుబంధంగా తెలంగాణ ఆర్టీసీలో ఉన్న ఐఎన్టీయూసీ యూనియన్ను ఆ పార్టీ వదిలేసిందనే భావన కార్మికుల్లో వచ్చేసింది. ఇన్నాళ్లూ ఆ యూనియన్ నుంచి కాంగ్రెస్ ఎదుగుదల కోసం కృషిచేసిన ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సేవలను విస్మరించి.. కొత్తగా పుట్టుకొచ్చిన అశ్వత్థామరెడ్డి యూనియన్ అయిన (టీడబ్ల్యూయూ)కి సహకారం అందించాలని టీపీసీసీ చీఫ్ లేఖ రాయడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ జెండా పట్టుకున్న కార్యకర్తను వదిలేసి మరొక యూనియన్ కోసం పనిచేయమని పీసీసీ అధికారికంగా కోరడం ఏందని ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యమైతే, కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీని పోటీలోకి దించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక స్పష్టమైన విధానం, ఒకే సంస్థాగత ప్రమాణం ఉండాల్సిన సమయంలో కొత్త యూనియన్‌కు మద్దతివ్వాలని ఎలా కోరుతారని ప్రశిస్తున్నారు. కాంగ్రెస్-ఐఎన్టీయూసీ సంబంధాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో అధికారికంగా లేఖ విడుదలైనందున, ఆ లేఖ ఉద్దేశం, పరిధిపై కూడా అధికారిక వివరణ రావాలని డిమాండ్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ లేఖతో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎస్టీయూసీ కింద ఉన్న కార్మికులు తీవ్ర గందరగోళంలో ఉన్నట్టు చెప్తున్నారు.