Degree Lecturers | డిగ్రీ ఆచార్యుల భర్తీపై రచ్చ.. మెరిట్ అభ్యర్థులకు మార్కుల ముప్పు
Degree Lecturers | రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ విధానంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో 4తో నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Degree Lecturers | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ విధానంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో 4తో నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అటు అధ్యాపకులు, ఇటు నిరుద్యోగ అభ్యర్థులు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారు. దాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవో 4ను జారీ చేసింది.
కొలువుల భర్తీకి మార్కుల మెలికను తగిలించింది. అంతేకాకుండా అకడమిక్ మార్కులకు వెయిటేజీ.. ఇంటర్వ్యూలను పునరుద్ధరించింది. మొత్తంగా జీవో 4తో ఆచార్యుల కొలువుల భర్తీ మరింత జటిలం కానుంది. జీవో4ను రద్దుచేయాల్సిందేనని.. జీవో 6 ఆధారంగా పోస్టులు భర్తీచేయాలని అధ్యాపక సంఘాల నేతలు, నెట్, జేఆర్ఎఫ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తున్నది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకానున్నది. గతంలో జారీ అయిన 514తో పాటు, మరో వెయ్యిపోస్టులు అదనంగా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిరుద్యోగుల అభ్యంతరాలివి
- గతంలో యూజీ, పీజీ మార్కులను పరిగణనలోకి తీసుకోలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఆయా మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పదేండ్ల క్రితం 50 శాతం మార్కులు రావడమే గొప్ప. కానీ ఇప్పుడు 80-90 శాతం మార్కులు సాధిస్తున్న విద్యార్థులున్నారు. దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారు?
- రాష్ట్రంలో కొన్ని వర్సిటీల్లో ఒక్కో రకంగా మార్కులేస్తున్నారు. ఓయూలో పీజీ కోర్సుల్లో గరిష్ఠంగా 80- 90 శాతం మార్కులు వేస్తుండగా, కాకతీయ, బీఆర్ అంబేద్కర్ వంటి వర్సిటీల్లో 50- 60 శాతం మార్కులకు మించడంలేదు. కొన్ని డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీల్లోని విద్యార్థులకు 90 95 శాతం మార్కులు వేస్తున్నారు. ఈ వ్యత్యాసం అనేక మంది అభ్యర్థులకు అశనిపాతంగా మారనున్నది. ఈ అన్యాయాన్ని ఎలా సవరిస్తారు?
- ఇటీవలి కాలంలో ఐదు నుంచి ఆరు లక్షలు తీసుకుని కొన్ని ప్రైవేట్ వర్సిటీలు పీహెచ్‌డీలు జారీ చేస్తున్నాయి. ఉస్మానియా, జేఎన్టీయూ వంటి ప్రతిష్టాత్మక వర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేసి పీహెచ్డీ పట్టాలు పుచ్చుకున్నవారిని, ఐదారులక్షలిచ్చి పీహెచ్డీ పట్టాలు పుచ్చుకున్న వారిని ఒకే గాటన కట్టడం సమంజసమేనా?
- రీసెర్చ్ పబ్లికేషన్స్‌కు ఆరు మార్కులు కేటాయించారు. యూజీసీ కన్సార్టియం ఫర్ అకడమిక్ అండ్ రీసెర్చ్ ఎథిక్స్ (కేర్) జర్నల్స్ లిస్ట్‌ను ఉపసంహరించింది. మరీ ఏ రీసెర్చ్ పబ్లికేషన్స్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు?
ఇంటర్వ్యూలతో పక్షపాతం
ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు అంటేనే అన్యాయాలు, అసమానతలకు తార్కాణం. వివక్ష, ప్రాంతీయ తత్వం, ఆశ్రితపక్షపాతం, అవకతవకలు.. పైరవీలకు కేరాఫ్ అడ్రస్. పోస్టుకు ఇంత అని బహిరంగంగా విక్రయించేందుకు మార్గం సుగమం చేయడమే. స్థూలంగా ప్రతిభకు పాతరేయడమే. ఇలాంటి వివాదాస్పద ఇంటర్వ్యూ విధానాన్ని కాంగ్రెస్ సర్కార్ డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీలో తిరిగి ప్రవేశపెట్టింది. దీన్ని నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఆశ్రిత పక్షపాతానికి దారితీస్తుందని నెట్, సెట్, జేఆర్ఎఫ్ అభ్యర్థులంటున్నారు. ఇంటర్వ్యూల పేరిట తమ అనుకూలురకు పోస్టులు కట్టబెట్టే కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఇంటర్వ్యూలను రద్దుచేయాల్సిందేనని.. లేదంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పోస్టుల సంఖ్య పెంచి భర్తీ చేయాలి: డిగ్రీ అధ్యాపకుల సంఘం
డిగ్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్యను 2,500కు పెంచి ఒకే సారి భర్తీ చేయాలని ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి బ్రిజేశ్, అసోసియేట్ సెక్రటరీ అమరేందర్‌రెడ్డి, పీ సుభాష్‌రెడ్డి కోరారు. 541 పోస్టులను భర్తీ చేస్తే కాలేజీల్లో బోధనకు ఇబ్బందులొస్తాయని చెప్పారు. అప్రెంటిస్‌షిప్, ఏఐఎంఎల్, డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ గేమింగ్, యానిమేషన్, కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్ వంటి కొత్త కోర్సుల్లో విద్యార్థులు పెరిగిందున, ఆయా కోర్సుల్లో కొత్త పోస్టులు మంజూరుచేసి తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయాలని కోరారు. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, కళాశాల విద్యాశాఖ అధికారులను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ పోస్టుల భర్తీకి అనుసరిస్తున్న జీవో 4తో ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందని.. జీవో 6 ద్వారానే పోస్టులు భర్తీచేయాలని డిమాండ్ చేశారు.
జీవో4ను అంగీకరించం : నెట్, సెట్, జేఆర్ఎఫ్ అభ్యర్థులు
డిగ్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం జారీచేసిన జీవో 4ను రద్దు చేయాలని యూజీసీ నెట్, సెట్, జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అభ్యర్థులు దుర్గం హరీశ్, వినయ్, సందీప్, మధు స్వాతి డిమాండ్ చేశారు. ఇదే జీవోతో ముందుకెళ్లడాన్ని తాము అస్సలు అంగీకరించమని తేల్చిచెప్పారు. అకడమిక్ వెయిటేజీ తీవ్ర అసమానతలకు కారణమవుతుందని పేర్కొన్నారు. రాత పరీక్షలో సాధించిన మార్కులకు ప్రాధాన్యత తగ్గుతుందని.. ఇంటర్వ్యూలతో పారదర్శకత లోపిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. 12 ఏండ్లుగా నియామకాల్లేవని.. వీటి కోసం ఎదురుచూస్తున్న వారికి తీరని నష్టం కలుగుతుందని వాపోయారు.
ద్వంద్వ విధానమేంది?
ఒకే రాష్ట్రంలో ఒకే పోస్టుకు రెండు రకాల భర్తీ విధానం ఎలా ఉంటుందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ద్వంద్వ విధానాలను అనుసరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి జీవో 4ను జారీచేసినట్టు ప్రభుత్వం పేర్కొన్నది. అయితే యూజీసీ మార్గదర్శకాల్లో ఎక్కడా రాత పరీక్ష గురించిన ప్రస్తావనే లేదు. మరి యూజీసీ మార్గదర్శకాలనే అనుసరిస్తే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొంత కాలం క్రితం రాష్ట్రంలో యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్కు జీవో 21ని ప్రభుత్వం జారీచేసింది. ఈ జీవోలో రాత పరీక్ష గురించిన ప్రస్తావనే లేదు. 70 శాతం అకడమిక్ మార్కులు, 30 శాతం ఇంటర్వ్యూకు మార్కులు కేటాయించారు. డిగ్రీ కాలేజీల్లోని టీచింగ్ పోస్టులను సైతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పేరుతోనే పిలుస్తున్నారు. వీటి భర్తీకి మాత్రం 40 మార్కులకు రాత పరీక్ష ఉంటుందని జీవో 4 ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు రకాల భర్తీ విధానంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

