సిటీలో నీటి దొంగలు రెచ్చిపోతున్నారు. భూగర్భ జలాలను జలగల్లా పీల్చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వేలాది అడుగుల లోతులో బోర్లను తవ్వుతూ నీటిని అందినకాడికి తోడేస్తున్నారు. కనీస అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా బోర్లు తవ్వుతున్నారు. హాస్టళ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల యజమానులు జలమండలి నీళ్లు సరిపోకపోవడంతో బోర్లు వేస్తున్నారు. బోర్ల సంఖ్య వేలాదిగా పెరిగిపోతుండటంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. దీంతో బోర్లన్నీ ఎండిపోతున్నాయి. ప్రైవేట్ హాస్టళ్లు, అపార్ట్మెంట్లలోని బోర్లు ఎండిపోతుండటంతో సమీపంలోని రోడ్లు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా బోర్లు వేస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో ప్రహరీలకు ఆనుకుని ఉన్న రోడ్లు, ఖాళీ స్థలాల్లో బోర్లు వేసి నీటిని ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. ఈ తతంగం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బహిరంగంగా జరుగుతున్నది. కానీ ఎక్కడా మున్సిపల్, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదు. అక్రమంగా వేస్తున్న బోర్లను అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రైవేట్ హాస్టళ్లు, బహుళ అంతస్తుల భవనాల యజమానులు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి కనీస తనిఖీలు నిర్వహించడం లేదని ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికైనా అక్రమంగా వెలుస్తున్న బోర్లను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ బోర్లను గుర్తించి సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా అక్రమ బోర్లు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా సైబర్ సిటీలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నది. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ బోర్లు తోడేస్తున్నారు. పీజీ హాస్టళ్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేని ప్రాంతాల్లో తవ్వేస్తున్నారు. స్టడీ సర్కిల్‌గా పేరొందిన దిల్సుఖ్నగర్, చైతన్యపురి ప్రాంతాల్లో యథేచ్ఛగా రోడ్లుపైనే బోర్లు వేసుకుని దానిపై మ్యాన్‌హోల్ కట్టి కవర్ వేసి ఇండ్లలోకి పైపులు వేసుకుంటున్నారు.
కమలానగర్, దిల్సుఖ్నగర్ లోటస్ ల్యాప్ స్కూల్ పరిసరాలు, దిల్సుఖ్నగర్ ప్రధాన రోడ్డు నుంచి కాలనీలకు వెళ్లే మార్గాల్లో కొందరు రోడ్లపైనే బోర్లు వేస్తున్నారు. అక్రమంగా రోడ్లపైన బోర్లు వేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. సామాన్య ప్రజలు బోరు వేసుకుంటే అనుమతులు తప్పనిసరి అని చెప్పే అధికారులు ఇష్టారీతిలో తమ కమర్షియల్ అవసరాల కోసం ప్రభుత్వ రోడ్లపైనే బోరు వేసినా చోద్యం చూస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తునారు. ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ భవనాలు, హాస్టళ్లు, ఇనిస్టిట్యూట్లుగా మారిపోవడంతో ఇష్టానుసారంగా బోర్లు వేస్తున్నారు.
వాల్టా చట్టానికి తూట్లు
వాల్టా చట్టం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో బోర్లు వేయాలంటే రెవెన్యూ శాఖ నుంచి అనుమతి పొందాలి. కానీ గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కడా వాల్టా చట్టం అమలు కావడం లేదు. ఇండ్లు, స్థలాలు, భవన సముదాయాల్లో బోర్లు వేస్తున్నవారు అనుమతులు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసిన వాళ్లపై కేసులు పెట్టాల్సిన రెవెన్యూ శాఖ అచేతనావస్థలో ఉంది. గ్రేటర్ పరిధిలో ఎక్కడా తనిఖీలు చేయడం కానీ, అక్రమార్కులపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. పీజీ హాస్టళ్లు, బహుళ అంతస్తుల భవనాల్లో వేల అడుగుల బోర్లు వేయడంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు అడుగంటి ఇండ్లలోని బోర్లు కూడా ఎండిపోతున్నాయి. దీంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలమండలి నీళ్లు సరిపోక.. బోర్లు ఎండిపోయి వేలాది రూపాయలు వెచ్చించి ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు.
అధికారులకు కనిపించడం లేదా?
రోడ్లపై బోర్లు వేస్తున్నా అధికారులకు కండ్లు కనిపించడం లేదా? నిబంధనలు పాటించకుండా బహిరంగంగా రోడ్లు ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా బోర్లు వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు. ఇష్టానుసారం బోర్లు వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయి సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 1979 ప్రాంతంలో ఇండ్ల నివాసాలకు పిల్లర్లు తీస్తే నీరు ఉబికి వచ్చేది. కానీ ఇష్టానుసారం భూగర్భ జలాలను తోడేస్తుండటంతో ఇప్పుడు ఇక్కడ రెండు వేల ఫీట్ల వరకు బోర్లను వేయాల్సి వస్తోంది. అక్రమార్కులపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. -వెంకటేశ్వర్రావు, కోదండరాంనగర్, దిల్సుఖ్నగర్