హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్లు ఎక్కువగా ఉన్నారు. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 17 మాత్రమే. మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తున్నాం. ఇదీ పాఠశాల విద్యాశాఖ తరచూ చెప్తున్న ముచ్చట. కానీ, రాష్ట్రంలోని కొన్ని సర్కార్ బడుల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. అనేక స్కూళ్లల్లో విద్యార్థులున్నా టీచర్లు లేరు. ఓ స్కూల్లో 72 మంది విద్యార్థులకు ఒకే టీచర్, 250 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లే.. 1-8 తరగతుల పిలల్లకు బోధించేందుకు ఉపాధ్యాయులు ఐదుగురు మాత్రమే ఉన్నారని, దీంతో బోధన కుంటుపడుతున్నదని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమించకుండా, ఉన్నవారిపైనే భారం మోపుతున్నారని మండిపడుతున్నారు.
కొలిక్కిరాని సర్దుబాట్లు..
అయితే, కొన్ని సర్కార్ బడుల్లో ఆరుగురు, ఏడుగురు విద్యార్థులకే ఇద్దరు టీచర్లూ ఉండటం గమనార్హం. ఒక విద్యార్థికే ఒక టీచర్ ఉన్న పాఠశాలలూ ఉన్నట్టు సమాచారం. అయితే, మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. కానీ, ఇది కొలిక్కి రాలేదు. అనేక జిల్లాల్లో ఇష్టారీతిగా సర్దుబాట్లు జరిగాయి. పిల్లలులేకుండా టీచర్లున్న స్కూళ్లు ఇంకా ఉన్నాయి. ఇదేకాకుండా బోధనతోపాటు బోధనేతర బాధ్యతలతో టీచర్లకు తలనొప్పులు తప్పడంలేదని వాపోతున్నారు. రాష్ట్రంలో 5వేలకు పైగా సింగిల్ టీచర్ స్కూళ్లున్నాయి. వీటిలో ఒకే ఉపాధ్యాయుడు బహుళ తరగతుల బోధన చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టు చెప్తున్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినంత టీచర్లు లేరని ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కే మహిపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కొన్ని ఉదాహరణలు ప్రస్తావించారు.
జీవో-25ను పునఃపరిశీలించాలి : ఎస్జీటీయూ
సర్కార్ బడుల్లో టీచర్లపై బోధనతోపాటు అనేక బోధనేతర బాధ్యతలు పెరిగాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఒక టీచర్ ఉంటే 1-5 తరగతల వరకు రోజుకు 18 సబ్జెక్టులను బోధించాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఆన్లైన్ పనులు, రికార్డుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్, సమావేశాలు, నివేదికలు, తనిఖీలతో బోధనకు తగిన సమయం ఉండటం లేదని చెప్తున్నారు. ‘ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం జారీచేసిన జీవో-25ను పునఃపరిశీలించాలి. విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులు, అవసరమైతే వలంటీర్లను నియమించాలి’ అని ఎస్జీటీయూ డిమాండ్ చేస్తున్నది. జీవో-25ను సవరించాలని, ఎఫ్ఎల్ఎన్ స్కూళ్లల్లో సబ్జెక్టుకు ఒక టీచర్‌ను కేటాయించాలన్న డిమాండ్‌తో ఎస్జీటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగినట్టు మహిపాల్‌రెడ్డి తెలిపారు.

Teacher
ఇదీ పలు స్కూళ్లలో పరిస్థితి..