తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి దేశ అత్యున్నత న్యాయస్థానం కచ్చితమైన తీర్పు ఇచ్చింది.
తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని తేల్చిచెప్పింది. ఈ మొత్తం పరిణామాలపై ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎలాగూ సిగ్గుపడరు. కాంగ్రెస్‌లో ఉన్నామంటారు, లేమంటారు. ఫిరాయించినట్టు రుజువు ఎక్కడుందని ఎదురు ప్రశ్నిస్తారు. హైకోర్టు తిట్టినా, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గుపడరు. ఇప్పుడు ఖైరతాబాద్‌లో రానున్న ఉపఎన్నికలో దానంకే కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సిగ్గుపడరు కదా!
దానం పార్టీ ఫిరాయింపుపై కథ అడ్డం తిరిగింది. ఈ పరిణామం అసెంబ్లీ స్పీకర్ల కాలయాపన, అధికార పార్టీల వ్యూహాత్మక నాన్చివేత ధోరణులకు చెక్ పెట్టినట్టు అయింది. దేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎదుర్కొంటున్న లోతైన రాజ్యాంగపరమైన పరిమితులను మరోసారి బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టులో ‘ఘర్ వాపసీ’పై జస్టిస్ బాగ్చి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. అత్యంత ఖరీదైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని రంగంలోకి దించినప్పటికీ దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో దిక్కు లేకుండా పోయింది. జస్టిస్ జాయ్మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం ముందు జరిగిన వాదనలు బీఆర్ఎస్ వర్గాల్లో సంతోషం, కాంగ్రెస్ వర్గాల్లో విషాదం నింపాయి.
సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలను గమనిద్దాం. మొదట స్పీకర్ ఇచ్చిన ఆర్డర్‌పై జస్టిస్ బాగ్చి వ్యంగ్యంగా స్పందిస్తూ, స్పీకర్ నిర్ణయం తీసుకున్న శైలి ఆకట్టుకున్నదని వ్యాఖ్యానించారు. దీనిపై రోహత్గీ స్పందిస్తూ, పార్టీ క్రమశిక్షణ లేదా ఫిరాయింపుల్లో ‘క్షమాపణ’ అనే వెసులుబాటు ఉంటుందని, తన క్లయింట్ ఇప్పటికీ బీఆర్ఎస్ సమావేశాలకు హాజరవుతున్నారని, పార్టీ కూడా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని, ఇది ఒకరకంగా ‘ఘర్ వాపసీ’ వంటిదని వాదించారు. ఆ సందర్భంలో జోక్యం చేసుకున్న జస్టిస్ బాగ్చి ఘాటుగా చురకలంటించారు. ఘర్ వాపసీయా? మీ వాదన చూస్తుంటే ఆయా రామ్, గయా రామ్, ఫిర్ ఆయా రామ్ అన్నట్టుంది. ఒక పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్న మరుక్షణమే సభ సభ్యత్వాన్ని కోల్పోతారని తేల్చిచెప్పారు.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం: పేరా 2(1)(బి): సభ లోపల విప్‌ను ఉల్లంఘించినప్పుడు మాత్రమే 15 రోజుల్లోగా రాజకీయ పార్టీ క్షమించే వెసులుబాటు ఉంటుంది. పేరా 2(1)(ఎ): సభ వెలుపల స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు అటువంటి క్షమాపణలకు తావులేదు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ‘బీ-ఫారం’ తీసుకుని, ఫారం-26 సమర్పించి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత, ఇంకా గత పార్టీలోనే ఉన్నానని చెప్పడం పచ్చి మోసం తప్ప మరొకటి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సాధారణంగా స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు స్వీకరిస్తారో, తిరస్కరిస్తారో ఒకే ఒక్క పాయింట్ మీద నిలబడుతుంది. కానీ ధర్మాసనం ఓ నాలుగు అక్షింతలు వేసి మరీ కొట్టివేసింది.
హైకోర్టు అనర్హత వేటు వేయగానే దానం నాగేందర్ తొలుత తాను సుప్రీంకోర్టుకు వెళ్లబోనని, ప్రజాతీర్పునకే సిద్ధమని ప్రకటించారు. అదే మంచి స్పందన అని రాజకీయ పరిశీలకులు అనుకుంటారు. కానీ ఆ అవకాశం లేదు. మరుసటి రోజే ‘ప్రభూ దృశ్యం మారిపోయింది’ అని చెప్పుకోవలసి వచ్చింది. కాంగ్రెస్‌లోని కొందరు వ్యూహకర్తల అత్యుత్సాహం వల్ల ఆయన పేరుతో సుప్రీంకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలైంది.
స్టే తెచ్చుకుని ఉపఎన్నికను ఎలాగైనా వాయిదా వేయించవచ్చన్న ఆశతో వేసిన ఈ తప్పటడుగు దానంను దెబ్బతీసింది. ఒకవైపు అధికార కాంగ్రెస్‌లో ఉంటూ, కోర్టు బోనులో నిలబడి ‘నేను ఇంకా బీఆర్ఎస్ వాడినే, ఇది ఘర్ వాపసీ‘ అని వాదించాల్సిన స్థితి దానంకు ఎదురైంది. చివరకు దేశ ఢిల్లీ స్థాయిలో పెద్దల ముందు చీవాట్లు తిని, పరువు బజారున పడేసుకున్న ఫలితం మిగిలింది.
మొత్తానికి హైకోర్టు 2024 ఏప్రిల్ 23 నుంచే దానం నాగేందర్‌పై అనర్హత వర్తిస్తుందని ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయిందని తేల్చిచెప్పింది. అయితే ఇక్కడే ఒక కీలకమైన రాజ్యాంగ సంక్లిష్టత నెలకొన్నది. అనర్హత వేటు పడిన దానం నాగేందర్, అదే ఖాళీకి జరిగే ఉపఎన్నికలో మళ్లీ పోటీ చేయవచ్చా? 2020లో కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేల కేసులో (శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ వర్సెస్ కర్ణాటక స్పీకర్) సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం, అనర్హతకు గురైన ఎమ్మెల్యే తక్షణమే మళ్లీ పోటీ చేయవచ్చు. ఆర్టికల్ 191(1): సాధారణ అనర్హతలు (లాభదాయక పదవులు, నేరారోపణలు): సభ్యుడిగా ఎన్నిక కావడానికి, కొనసాగడానికి అనర్హత. ఆర్టికల్ 191(2)పదో షెడ్యూల్ అనర్హత (ఫిరాయింపులు): సభ్యుడిగా కొనసాగడానికి మాత్రమే అనర్హత. తదుపరి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఇది నిషేధించదు. జస్టిస్ ఎన్.వి.రమణ నాయకత్వంలోని ధర్మాసనం పేర్కొన్న ప్రధాన అంశాలు ఉన్నాయి. నిజానికి ఈ తీర్పు, ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనుకూలంగా, రాజ్యాంగ నైతికతకు వ్యతిరేకంగా ఉన్నది.
ఆర్టికల్ 164(1బీ), 361బీ నిబంధన: 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్ 164(1బి) ప్రకారం, ఫిరాయింపుల వల్ల అనర్హుడైన సభ్యుడు ఆ అసెంబ్లీ కాలపరిమితి ముగిసేవరకూ లేదా ‘ఆ స్థానానికి జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచే వరకు ‘మంత్రి పదవి చేపట్టడానికి వీల్లేదు. అంటే, అనర్హుడైన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని రాజ్యాంగమే పరోక్షంగా అంగీకరిస్తున్నది. ఈ తీర్పు ప్రకారం దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడినప్పటికీ, ఎన్నికల సంఘం నిర్వహించే ఖైరతాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ వేయడానికి చట్టపరమైన అడ్డంకి ఉండకపోవచ్చు.
స్పీకర్‌కు పరిమితి విధించే అధికారం లేదు: పదో షెడ్యూల్ కింద స్పీకర్ ఒక సభ్యుడిని ఆ అసెంబ్లీ పదవీకాలం ముగిసేవరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అధికారం లేదు. స్పీకర్ న్యాయమూర్తి తరహా ట్రిబ్యునల్ మాత్రమే తప్ప, రాజ్యాంగ పరిధిని దాటి శిక్షలు విధించలేరు.
ఆర్టికల్ 164(1బీ), 361బీ నిబంధన: 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్ 164(1బి) ప్రకారం, ఫిరాయింపుల వల్ల అనర్హుడైన సభ్యుడు ఆ అసెంబ్లీ కాలపరిమితి ముగిసేవరకూ లేదా ‘ఆ స్థానానికి జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచే వరకు ‘మంత్రి పదవి చేపట్టడానికి వీల్లేదు. అంటే, అనర్హుడైన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని రాజ్యాంగమే పరోక్షంగా అంగీకరిస్తున్నది. ఈ తీర్పు ప్రకారం దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడినప్పటికీ, ఎన్నికల సంఘం నిర్వహించే ఖైరతాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ వేయడానికి చట్టపరమైన అడ్డంకి ఉండకపోవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 కింద 6 ఏండ్ల నిషేధం ఎందుకు వర్తించదు అంటే, సాధారణంగా ఎన్నికల చట్టాల్లో ఒకసారి అనర్హత వేటు పడితే ఆరేండ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం ఉంటుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంటుంది. కానీ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 సూత్రాలు ఇక్కడ వర్తించని ఒక ఆలోచన. క్రిమినల్ శిక్ష ఉంటేనే సెక్షన్ 8. అవినీతి నిరోధక చట్టం కింద శిక్ష పడినా, లేదా ఏదైనా క్రిమినల్ కేసులో రెండేండ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడినప్పుడు మాత్రమే ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(1), (2), (3) కింద ఒక ప్రజాప్రతినిధి తన పదవిని కోల్పోవడంతోపాటు, జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ఆరేండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఎదుర్కొంటారని అంటారు.
పదో షెడ్యూల్ వేరు, సెక్షన్ 8 వేరు: పదో షెడ్యూల్ కింద విధించే అనర్హత పూర్తిగా రాజకీయ ప్రవర్తనకు సంబంధించింది. ఆర్టికల్ 191(1)(ఇ) వర్తించాలంటే స్పష్టమైన చట్టబద్ధమైన నేరం లేదా నేరారోపణ రుజువు కావాలి. అటువంటి క్రిమినల్ నేర నిర్ధారణ ఏదీ లేనప్పుడు, సెక్షన్ 8లోని ఆరేండ్ల నిషేధాన్ని తీసుకొచ్చి పదో షెడ్యూల్ అనర్హతలకు అన్వయించడం రాజ్యాంగపరంగా చెల్లదనే అవకాశం ఉన్నది. న్యాయస్థానాలు రాజ్యాంగంలో లేని అంశాలను లేదా పార్లమెంట్ ఉద్దేశపూర్వకంగా చేర్చని నిబంధనలను తమంతట తాము చట్టంలోకి తీసుకురాలేవు.
ఈ న్యాయపరమైన లొసుగులు ఫిరాయింపుదారులకు ఒక సురక్షితమైన రాజకీయ రక్షణను కలిగిస్తున్నాయి. ఆ రక్షణ లేకపోతే ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి మారడం, స్పీకర్ ద్వారా విచారణలను ఏండ్ల తరబడి వాయిదా వేయించి అధికారాన్ని, జీతభత్యాలను అనుభవించడం, చివరికి కోర్టులు అనర్హత వేటు వేస్తే, శ్రీమంత్ పాటిల్ తీర్పు ఆసరాగా మళ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలువడం. గెలిచిన వెంటనే ఆర్టికల్ 164(1బీ) ప్రకారం మళ్లీ మంత్రి పదవులను దక్కించుకోవడం. ఇది రాజ్యాంగ నైతికతను అపహాస్యం చేయడమే అవుతుంది. దానం నాగేందర్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు స్పీకర్ల పక్షపాత ధోరణిని ఎండగట్టి ఒక గట్టి హెచ్చరిక పంపినప్పటికీ, ప్రస్తుత చట్టం ప్రకారం ఆయన ఉపఎన్నికలో పోటీ చేయకుండా అడ్డుకోలేకపోవడం పెద్ద లోపం. ఈ దుర్నీతికి శాశ్వత ముగింపు పలుకాలంటే పదో షెడ్యూల్ కింద అనర్హతకు గురైన ఏ సభ్యుడైనా ఆ శాసనసభ మిగిలిన కాలపరిమితి ముగిసే వరకు ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ప్రజాప్రాతినిధ్య చట్టంలో ప్రత్యేక సవరణ తీసుకురావాల్సిన బాధ్యత పార్లమెంట్‌పైనే ఉన్నది. లేనిపక్షంలో, రాజ్యాంగ ధర్మాసనాలు ఎన్ని మొట్టికాయలు వేసినా ఆయా రామ్.. గయా రామ్‌ల రాజకీయ క్రీడ నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది.
(వ్యాసకర్త: న్యాయ నిపుణుడు)
మాడభూషి శ్రీధర్