ఖైరతాబాద్, ఆగస్టు 10 : నిమ్స్‌లో ఈ నెల 13 నుంచి హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్ అమరేశ్వర్ రావు నేతృత్వంలో లండన్‌కు చెందిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నపనేని, సాంకేతిక నిపుణుల బృందం సాయంతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నామన్నారు. ప్రతి ఏడాది శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని, ఈ ఏడాది కూడా అవసరమున్న వారికి ప్రాధాన్యత కేటాయించి వాక్ ఇన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
తల్లిదండ్రులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2వరకు నిమ్స్ పాత ఔట్ పేషెంట్ బ్లాక్‌లోని మొదటి అంతస్తు సిటీ సర్జరీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. గతంలో చేయించిన వైద్య పరీక్షల రిపోర్టులు అందుబాటులో ఉంటే వెంట తీసుకురావాలని, చికిత్స అవసరమున్న చిన్నారుల తల్లిదండ్రులు ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయాల్లో నిమ్స్‌కు నేరుగా వచ్చి సంప్రదించవచ్చన్నారు. వివరాలకు 040-23489025 నంబరులో సంప్రదించాలన్నారు.