TMREIS | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీ దొరకడం లేదని చెబుతూ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (టెమ్రిస్) పరిధిలోని సీవోఈలను కుదించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సీవోఈని బార్కస్‌కు తరలించారు. అక్కడ ఉన్న పార్ట్‌టైం, గెస్ట్‌ఫ్యాకల్టీని తొలగించారు. దీంతో సొసైటీ తీరుపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సీవోఈలను ఎత్తివేసేందుకు నిర్ణయించారని, అందులో భాగంగా తొలుత కుదిస్తున్నట్టు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.
మైనార్టీ విద్యార్థులకు ఇంటర్ విద్యతోపాటు నీట్, ఎంసెట్, ఐఐటీ, జేఈఈ, లాసెట్, సివిల్స్, క్యాట్ తదితర జాతీయ పోటీపరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు టెమ్రిస్ రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)లను ఏర్పాటు చేసింది. బాలుర కోసం రాజేంద్రనగర్, బార్కస్, సంగారెడ్డి జిల్లా కంది, అల్గోల్ కాగా, బాలికల కోసం రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, గొల్కొండలో సీవోఈలను నెలకొల్పింది. నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీ అందుబాటులో లేరని, విద్యార్థులు రావడం లేదని తదితర కారణాలను చెబుతూ ఆ సీఈవోలను కుదించేందుకు టెమ్రిస్ సిద్ధమైంది. ఇప్పటికే రాజేంద్రనగర్‌లోని సీవోఈని బార్కస్‌కు తరలించింది. అక్కడి ఫ్యాకల్టీని కూడా తొలగించింది. మొత్తంమీద 8 సీవోఈలను 4 సీవోఈలుగా కుదించి, వాటిని కూడా హైదరాబాద్ కేంద్రంగానే నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇదే విషయమైన అధికారులను సంప్రదిస్తే మెరుగైన శిక్షణ ఇవ్వడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామని వివరిస్తున్నారు.