POK | మీర్పూర్ : పాకిస్థాన్ విధిస్తున్న పన్నులపై పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మీర్పూర్ జిల్లాలోని దడ్యాల్ తహశీల్లో శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పదుల సంఖ్యలో నిరసనకారులను అరెస్ట్ చేశారు. మొదట్లో ఈ నిరసనలను శనివారం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా అదనపు బలగాలను మోహరించడంతోపాటు, 70 మంది ఉద్యమకారులను అరెస్ట్ చేయడంతో ప్రజలు శుక్రవారమే వీధుల్లోకి వచ్చి, నిరసన తెలిపారు.
నిరసనకారులు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వడంతోపాటు ఘర్షణకు దిగారు. దీంతో అధికారులు పలు ఆంక్షలు విధించారు. జమ్ముకశ్మీరు సంయుక్త అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాలని ఈ కమిటీ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. వీటిలో కొన్ని సమీపంలోని పాఠశాలలోకి దూసుకెళ్లడంతో కొందరు బాలికలు గాయపడినట్లు తెలుస్తున్నది.