శంషాబాద్ రూరల్, మార్చి 4 ; రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామ సరిహద్దులో అక్రమ క్రషర్ల పరంపర యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రజాపాలన అంటూ అనుయాయులకు ఎలాంటి అనుమతులు లేకుండానే విలువైన భూములను కట్టబెడుతున్న కాంగ్రెస్ పెద్దలు.. మరోవైపు అనైన్డ్ భూముల్లో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే అక్రమ క్రషర్ల దందాను కొనసాగుతుండటంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ పేరిట గత కొన్నాళ్లుగా క్రషర్ల దందా నిర్వహిస్తున్నది. వీటికి శాఖాపరంగా ఎలాంటి అనుమతులు లేవని స్థానిక అధికారులు తేల్చిచెబుతున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ప్రజలు అనేక సార్లు మైనింగ్ శాఖకు ఫిర్యాదులు చేస్తే వాటిలో ఈ సంస్థ పేరును చేర్చకుండానే సంబంధిత శాఖ రెవెన్యూ అధికారులకు పంపింది. మిగతా వాటిపై చర్యలు చేపట్టిన అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. చెప్పేవన్ని శ్రీరంగ నీతులు చేసేవన్ని అవినీతి పనులేనని శంషాబాద్ క్రషర్ల పనితీరు చూస్తే అర్థమౌతుంది. ఇంత బహిరంగంగా క్రషర్ల నిర్వహణ చేపడుతూ.. పర్యావరణాన్ని యథేచ్ఛగా వినాశనం చేస్తున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం అడుగుముందుకేసే పరిస్థితి కనిపించడం లేదు.
కొత్వాల్‌గూడ గ్రామ సర్వే నం.62, 63లలోని సుమారు పదెకరాల అసైన్ట్ భూముల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అనధికారిక లీజుతో ఎలాంటి అనుమతులు లేకుండా రెండేండ్లుగా క్రషర్లను నడుపుతున్నది. మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు లేకుండా రెవెన్యూ శాఖ మంత్రి తన అధికార బలంతో నిర్వహిస్తున్నారు. అన్ని పారదర్శకంగా కొనసాగిస్తున్నామంటూ ప్రగల్బాలు పలికే మంత్రిగారు ఈ అనుమతులపై ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరమెంతైనా ఉందని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
శంషాబాద్ పట్టణంతో పాటు శంషాబాద్- షాబాద్ రహదారి నిర్మాణం కోసం అనుమతులు తీసుకొని ఏర్పాటు చేశామంటూ బాహ్య ప్రపంచానికి చెబుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఆ పేరుతో కోట్లాది రూపాచల విలువైన సహజ వనరులను కొల్లగొడుతున్నది. కాలుష్య నియంత్ర బోర్డుతో పాటు హెచ్ఎండీఏ, రెవెన్యూ అనుమతులు లేకుండా ఐదెకరాల ఎనిమిది గుంటల అసైన్డ్ భూముల్లో తిష్టవేశారు. క్రషర్ మిషన్‌కు సంబంధించిన రాళ్లను రాజేంద్రనగర్ రెవెన్యూ ప్రాంతంలోని మానస హిల్స్ ప్రాంతంలో నుంచి తీసుకువచ్చి కొత్వాల్‌గూడలో ఏర్పాటు చేసిన క్రషర్లలో రాత్రింబవళ్లు యథేచ్ఛగా పనులు చేసుకుంటూ ఇక్కడి నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధించి నిర్మాణాలకు తరలిస్తుండటం గమనార్హం. ఇదేమిటనీ ప్రశ్నించే నాథుడే ఇక్కడ లేకపోవడం విశేషం. ప్రశ్నిస్తే అధికార యంత్రాంగం కిమ్మనకుండా ఉండిపోయింది. ఇక్కడ కొండలు, గుట్టలన్నీ పిండిచేసే పొంగులేటి సంస్థ కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకుంటుందనే ఆరోపణలు గుప్పమంటున్నాయి.
దుమ్ముతో కమ్మేస్తున్న దిగువ ప్రాంతాలు
కొత్వాల్‌గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన రాఘవ సంస్థ క్రషర్ కంపెనీలతో ఔటర్‌రింగ్ రోడ్డుపై రాత్రి, పగలు తేడా లేకుండా దుమ్ముతో ఈ ప్రాంతాలు కమ్మేస్తున్నాయి. దిగువ ఉన్న హిమాయత్‌సాగర్ జలాశయం పరిసరాల్లో ఉన్న గ్రామాలన్నీ దుమ్ముతో కమ్మేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ప్రయాణించే ప్రజలు అనేక అనారోగ్యాల భారిన పడుతున్నారు. స్థానిక ప్రజలు ఎన్ని పర్యాయాలు అధికారులకు ఈ క్రషర్లపై ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యారని ప్రజలు అంటున్నారు. ఈ క్రషర్లతో ఎవరికి ప్రయోజనమని ప్రశ్నిస్తే వారిపై మంత్రి పొంగులేటి కక్ష సాధింపులు చేస్తున్నారంటూ పలువురు అధికార పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఇంత దయనీయ పరిస్థితిలో శంషాబాద్‌లో మంత్రి పొంగులేటి దందాలు కొనసాగుతున్నాయి.
రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్లకు అనుమతులు లేవు
శంషాబాద్ మండల రెవెన్యూ పరిధిలోని కొత్వాల్‌గూడ గ్రామ సర్వే నంబర్లలో కొనసాగుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వహిస్తున్న క్రషర్లకు ఎలాంటి అమనుతులు లేవని తహసీల్దార్ రవీంద్ర దత్ స్పష్టం చేశారు. స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి సంస్థ/మైనింగ్ సంస్థలు ఇచ్చిన నివేదికలో ఉన్న 20 రెడిమిక్స్ ప్లాట్లను ఇటీవలే తాము సీజ్ చేశామని వెల్లడించారు. ఆ లిస్టులో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు లేదన్నారు. మిగతా విషయాలు తనకేమీ తేలియదని తహసీల్దార్ వెల్లడించారు.
– శంషాబాద్ తహసీల్దార్ రవీంద్ర దత్
బీఆర్ఎస్ పర్యటన
కొత్వాల్‌గూడ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న క్రషర్లను పరిశీలించేందుకు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం గురువారం ఉదయం పదిగంటలకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నది. రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థతో పాటు ఇతర క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లు ,పలు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్థానిక నాయకులతో కలిసి పరిశీలించనున్నట్లు తెలిసింది.