Fruits | ఇటీవలి కాలంలో రిఫ్రిజిరేటర్ ఒక ముఖ్యమైన గృహ ఉపకరణంగా మారిపోయింది. మాంసం, పాల ఉత్పత్తులు, పండ్లు , కూరగాయలు లాంటివాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. అయితే, కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదని చెబుతున్నారు నిపుణులు. ఇలా ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడమే కాకుండా,విషపూరితంగా మారే ప్రమాదం ఉంది.
అరటిపండ్లు : అరటిపండును రిఫ్రిజిరేటర్లో ఉంచితే చాలా త్వరగా నల్లగా మారుతుంది. ఈ పండ్ల నుంచి ఇథిలీన్ వాయువు బయటికి వస్తుంది. దీనివల్ల ఫ్రిజ్‌లో ఉంచిన ఇతర పండ్లు త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది! కాబట్టి అరటిపండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో, ఇతర పండ్లతో కలిపి ఉంచకూడదు.
పుచ్చకాయ : వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఈ పండు చాలా పెద్దది కాబట్టి ఒక్కసారిగా తినడం కష్టం. అందుకే చాలామంది పుచ్చకాయ ముక్కలను రిఫ్రిజిరేటర్లో భద్రపరుస్తారు. ఇలా ఉంచితే ఆ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు పాడైపోతాయి. తినడానికి ముందు కొంత సమయం వరకు వాటిని రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.
యాపిల్ : యాపిల్ పండ్లను రిఫ్రిజిరేటర్లో ఉంచితే అవి త్వరగా పండిపోతాయి. యాపిల్‌లో ఉండే క్రియాశీల ఎంజైమ్‌ల కారణంగా ఆపిల్ త్వరగా పండుతుంది. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే కాగితంలో చుట్టి ఉంచడం మంచిది. రేగు, చెర్రీస్ వంటి విత్తనాలు ఉన్న పండ్లను కూడా రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదు.
మామిడి : మామిడిని రిఫ్రిజిరేటర్లో పెట్టకూడదు. దీనివల్ల మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి. పోషకాలు కూడా నశిస్తాయి.
లిచీ పండ్లు : లిచీని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పైభాగం బాగానే ఉన్నా గుజ్జు లోపలి భాగం త్వరగా పాడవుతుంది.