Uttarpradesh : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో భారీ వర్షాలు (Heavy Rains), వర్షాలవల్ల జరిగిన ప్రమాదాల్లో రాష్ట్రవ్యాప్తంగా 56 మంది మృతిచెందారు. మరో 46 మంది గాయపడ్డారు. సీతాపుర్ జిల్లా (Sitapur district) లో అత్యధికంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలు జిల్లాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సాధారణ వర్షపాతం 1.8 మిల్లీమీటర్లతో పోల్చితే.. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా 45.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
యూపీలో మొత్తం 75 జిల్లాలు ఉండగా, 56 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఫరూఖాబాద్ జిల్లాలో సాధారణం కంటే 7,385 శాతం ఎక్కువ వర్షం పడింది. కాన్పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పుర్, బరేలీ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వెయ్యికిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఘాఘ్రా, రాప్తి నదుల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరించింది.
ఉన్నావ్‌లోని సోనిక్ టోల్‌ప్లాజా వద్ద గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) యూపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆ రహదారి పేరును ‘గంగా ఎక్స్‌ప్రెస్ వాటర్‌వే’ గా మార్చాలని ఎద్దేవా చేశారు.