సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల, మల్కాజిగిరితో పాటు మొత్తం 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 13న జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 1218 లొకేషన్స్‌లలో 3209 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
90 పోలింగ్ లొకేషన్స్ పరిధిలో 387 సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లగా గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు కమిషనరేట్ పరిధిలో మొత్తం 289 మంది రూట్ ఆఫీసర్లను నియమించామని, వారికి కేటాయించిన రూట్లలో లొకేషన్లను పర్యవేక్షిస్తారన్నారు. అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్స్‌కు సహాయకులుగా ఏసీపీ స్థాయి అధికారులను కేటాయించినట్లు వివరించారు.
సైబరాబాద్ పరిధిలో 13న జరిగే పోలింగ్‌కు భారీ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు సీపీ వివరించారు. ఇందులో భాగంగా 13 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, 6వేల మంది సివిల్ పోలీసులు, 867 మంది ఆర్మ్డ్ ఫోర్స్ విధులు నిర్వర్తించనున్నట్లు తెలిపారు. ప్రతి ఈవీఎం స్టోరేజ్ పాయింట్స్ వద్ద ఇద్దరు చొప్పున పారామిలటరీ సిబ్బంది, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల వద్ద ఆరుగురు చొప్పున విధులు నిర్వర్తించనున్నట్లు తెలిపారు.
అంతర్జిల్లా సరిహద్దుల వద్ద మొత్తం 22 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 15 సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు, రెవెన్యూ అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికలను సూక్ష్మంగా పరిశీలించేందుకు 23ై ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, 24 స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను రంగంలోకి దింపామని, ఇవి 24/7 పాటు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయన్నారు.
ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.10 కోట్ల 54 లక్షల 55,093 నగదు సీజ్ చేసినట్లు సీపీ చెప్పారు. 796 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 910 లైసెన్స్డ్ తుపాకులను డిపాజిట్ చేసినట్లు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 1091 ఎన్నికల సంబంధిత ఎన్బీడబ్ల్యూ కేసులను ఎగ్జిక్యూట్ చేసినట్లు తెలిపారు.