– ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏఐఎస్ఎఫ్ వినతి
ఖమ్మం రూరల్, మార్చి 06 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలని అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొల్పాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు బుర్ర మనోజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఏఐఎస్ఎఫ్ పాలేరు నియోజకవర్గ సమితి నాయకుల ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ రూ.8 వేల కోట్ల పైచిలుకు బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటైన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో డిగ్రీ, పీజీ అయిపోయిన విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నట్లు తెలిపారు. దీంతో వారి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జూనియర్ కళాశాల లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఖమ్మం లేదా కూసుమంచి పరిసర ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించే పరిస్థితి నెలకొన్నట్లు చెప్పారు. కావున ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొల్పడం ద్వారా పేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బూర నవీన్, జంగాల వాసు, బొంపెళ్లి ఉదయ్, మహేశ్, మధు పాల్గొన్నారు.