Police Company | ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ముంబై అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. టీ-సిరీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘పోలీస్ కంపెనీ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. “ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ డి కంపెనీ” అనేది ఈ చిత్రానికి సంబంధించిన ట్యాగ్‌లైన్. 1990ల చివరలో, 2000ల ప్రారంభంలో ముంబైలో పెరిగిపోయిన గ్యాంగ్ వార్ కార్యకలాపాలను అణచివేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు స్క్వాడ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
దావూద్ ఇబ్రహీం తన ప్రత్యర్థి గ్యాంగ్లన్నింటినీ అంతం చేసి ‘డి కంపెనీ’ని ఎలా విస్తరించాడో, ఆ తర్వాత దావూద్‌కు, చోటా రాజన్‌కు మధ్య జరిగిన గొడవలు ముంబై అండర్ వరల్డ్‌లో ఏ విధంగా పెనుమార్పులకు దారితీశాయో వర్మ సోషల్ మీడియా వేదికగా వివరించారు. ముంబైలో విపరీతంగా పెరిగిన నేరాలను అణచివేయడానికి అప్పట్లో ప్రభుత్వం ఒక ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసిందని, ఈ స్క్వాడ్ 1997 నుంచి 2004 మధ్య కాలంలో దాదాపు 300 మందికి పైగా గ్యాంగ్స్టర్లను మట్టుబెట్టిందని ఆయన తెలిపారు.
ఈ స్క్వాడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు అధికారి అయిన దయా నాయక్ జీవితం, ఆ ప్రత్యేక బృందం చేసిన సాహసాల ఆధారంగా ‘పోలీస్ కంపెనీ’ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో దయా నాయక్ స్ఫూర్తితో రూపొందించిన ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు హర్షవర్ధన్ రానే కనిపించనున్నారు. ఇప్పటికే ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో ‘సత్య’, ‘కంపెనీ’ వంటి ఐకానిక్ చిత్రాలను అందించిన రామ్ గోపాల్ వర్మ, ఈసారూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న ఇతర నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.