KTR | కమలాపూర్/వీణవంక, మే 10: ఈ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్లో, కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో జరిగిన ఆత్మీ య సమ్మేళనంలో కేటీఆర్ ప్రసంగించారు. మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని చెప్పారు. కేం ద్రంలో ఉన్న బీజేపీ దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
ఐదేండ్లు కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఒక్క పనైనా చేసిండా? ఒక్క శిలాఫలకమైన ఉన్నదా? ఒక్క బడైనా, గుడైనా కట్టిండా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఐదేండ్లలో ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేయించని దద్దమ్మ బండి సంజయ్ అని మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నదా? ఇప్పుడు బాగున్నదా చెప్పాలని కోరగా, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండె.. అంటూ ముక్తకంఠంతో చెప్పారు. 2014లో బడేభాయ్ మోదీ, 2023లో చోటేభాయ్ రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ రూ.30 లక్షల కోట్లు దోచుకున్నడని.. దోచుకున్న సొమ్ముతో అదానీ, అంబానీలకు రూ.15 లక్షల కోట్లు రుణమాఫీ చేసిండని ధ్వజమెత్తారు.