వరంగల్, మార్చి 3 : కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు కోసం ‘గ్రేటర్’ వరంగల్ కార్పొరేషన్ నానా తంటాలు పడుతున్నది. సొంత వనరులు సమకూర్చుకోవడంలో ముందు చూపు లేకపోవడంతో రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నది. వరంగల్ నగర పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో ప్రతి టెండర్ రీకాల్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా బల్దియాకు ఆస్తి, నల్లా పన్నులతోపాటు భవన నిర్మాణాల ఫీజు ద్వారా ఆదాయం సమకూరుతుంది. అయితే పన్నుల సేకరణపై సరైన ప్రణాళికలు లేక పోవడంతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది.
ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 27 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. పన్నుల సేకరణ ద్వారా సుమారు రూ.120 కోట్ల వరకు ఆదాయం సమకూరాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఇందులో 50 శాతం కూడా దాట లేదు. ఈ ఆదాయం ఉద్యోగుల వేతనాలు, కరెంట్ బిల్లులకే సరిపోతున్నది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు నిధుల కొరత నెలకొనడంతో అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపు గగనంగా మారింది. వివిధ పథకాల నిధులతో చేపట్టిన పనులు మినహాయిస్తే సాధారణ నిధులతో చేపట్టిన పనులకు బల్దియా సొంత అదాయం నుంచే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. సుమారు రూ.80 కోట్ల వరకు సాధారణ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు ఏడాదిగా పెండింగ్లో ఉన్నాయి. వీటిని చెల్లిస్తేనే పనులు చేస్తామని కాంట్రాక్టర్లు ఖరాఖండిగా చెబుతున్నారు.
రూ. 50 కోట్ల రుణానికి ప్రతిపాదనలు
సాధారణ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు రూ.50 కోట్ల రుణం కోసం బల్దియా అధికారులు ప్రతిపాదనలు పంపారు. బ్యాంకుల నుంచి అప్పు తీసుకోని పెండింగ్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం ఇచ్చిన జీవో ట్రెడ్ (ట్రెడ్ రీజనబుల్ డిస్కంటింగ్ సిస్టమ్) అధారంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ బ్యాంక్ రుణం తీసుకునేందుకు సిద్ధమవుతున్నది. జీహెచ్ఎంసీలో ఇదే జీవో అధారంగా బ్యాంక్ రుణం తీసుకుంటున్నారు. పంచాయతీరాజ్ , ఇరిగేషన్ శాఖల్లోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ట్రెడ్ జీవో ప్రకారం బ్యాంక్ నుంచి రుణం తీసుకొని కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం వారం రోజుల క్రితం రూ.50 కోట్ల రుణానికి ప్రతిపాదనలు పంపించారు. గతంలో 100 కోట్ల రుణం కోసం బల్దియా తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే అప్పు ఇస్తాం.. ఎలా తీరుస్తారని బ్యాంకర్లు ప్రశ్నలు వేయడంతో ఆ ప్రయత్నాలు విరమించుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా మళ్లీ బ్యాంక్ అప్పుల కోసం బల్దియా ప్రయత్నాలు చేస్తున్నది.
అప్పు బల్దియాకు.. వడ్డీ కాంట్రాక్టర్లకు
ట్రెడ్ జీవో ప్రకారం బ్యాంక్ నుంచి బల్దియా అప్పు తీసుకుని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీ మాత్రం కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లు నుంచి ముందే కట్ చేసుకుంటారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాల్సిన అధికారులు కొత్త పద్ధతిలో వడ్డీ తమ నెత్తిన వేయడం ఏమిటని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. పనులు చేసి నెలలు గడిచిన తర్వాత చెల్లించే బిల్లులకు తాము వడ్డీ చెల్లించడం విడ్డూరంగా ఉందని పెదవి విరుస్తున్నారు.
సాధారణ నిధులతో చేపట్టిన పనులకే బిల్లులు
బల్దియా సాధారణ నిధులతో చేసిన పనులకు మాత్రమే బిల్లులు ఇవ్వాలనే నిబంధన ఉంది. వివిథ పథకాలు, సీఎంఈవై, సీడీఎఫ్ నిధులతో చేపట్టిన పనులకు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని వినియోగంచొద్దు. అయితే బల్దియా కాంట్రాక్టర్లకు సుమారు రూ.200 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సాధారణ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు సుమారు రూ.80 కోట్ల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రూ. 50 కోట్ల అప్పు కోసం ప్రతిపాదనలు పంపించారు.