KCR | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రజలు తెలంగాణకు సర్వనామంగా కీర్తిస్తారని మరోసారి నిరూపితమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 17 రోజులపాటు ఆయన తెలంగాణ అంతటా కలియదిరిగారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. ‘కేసీఆర్ ఎవరినీ కలువరు. కలవాలనుకున్నవాళ్లకే ఆయన నుంచి పిలుపు వస్తది. పిలుపు అందుకున్నవాళ్లే కేసీఆర్‌ను కలువాలె’ అని ఉద్యమకాలం నుంచి ఆయనపై రాళ్లు పడుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు అవి మరింత ఎక్కువయ్యాయి. కానీ, అవన్నీ ఉద్దేశపూర్వకంగా సృష్టించిన అసత్యాలని తెలంగాణ సమాజానికి మరోసారి అనుభవంలోకి వచ్చింది. తెలంగాణ సగటు పల్లెజీవిగా రోడ్డు పక్కన ఉన్న హోటల్‌కు వెళ్లి కూర్చొని పకోడీ తిని, చాయ్తాగి ఆ హోటల్ యజమానితో పిచ్చాపాటిగా మాట్లాడి కష్టసుఖాలు ఆలకించారు. తన కన్నా ముందే హోటల్లో కూర్చున్న రైతులతో ముచ్చట్లాడి వారి ‘సాగు’ బాగోగులను తెలుసుకున్నారు.
తన చుట్టూ గుమిగూడిన ఆడబిడ్డల సాదకబాధలను అడిగి తెలుసుకోవడం, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థుల హాస్టల్ బాధలకు ఆవేదన చెంది ఆగ్రహం వ్యక్తంచేయడం.. ఆయన బస్సుయాత్ర పొడవునా కనిపించిన దృశ్యాలు. పదేండ్లపాటు అధికార పనుల్లో బిజీగా ఉన్నందున పార్టీ అధినేతను కలుసుకోలేకపోయిన ప్రార్టీ శ్రేణులు, ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో తనతో కలిసి నడిచిన ఉద్యమసహచరులు, మేధావులు అనేకమంది కేసీఆర్‌ను కలుసుకొని వారి అనుభావాలను నెమరువేసుకున్నారు. బస్సుయాత్ర ద్వారా 17 రోజులపాటు (ఈసీ ఆంక్షల నేపథ్యంలో 48 గంటలు మినహాయింపు) రాష్ర్టాన్ని కలియతిరిగారు. ప్రతి రాత్రి రోడ్‌షో నిర్వహించిన పట్టణంలోనే బస చేసి, ఆ మరుసటి రోజు అందరినీ కలుస్తూ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 1న మహబూబాబాద్ రోడ్‌షో అనంతరం ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల విధించిన నిషేధం మినహా మిగతా షెడ్యూల్ అంతా యథావిధిగా కొనసాగింది. ముందు ప్రకటించిన షెడ్యూల్లో ఒక్క జమ్మికుంట మినహా 17 రోజుల ఆయన షెడ్యూల్లో ఏ మార్పూ లేకపోవటం గమనార్హం. కేసీఆర్ రోడ్‌షోలకు జనం బ్రహ్మరథం పట్టడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణకిసలాడుతున్నది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గత నెల 24న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు బయల్దేరిన కేసీఆర్ బస్సుయాత్ర శుక్రవారం సిద్దిపేటతో ముగిసింది. దీంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కేవలం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ, కేసీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా తన పర్యటనకు రూపల్పన చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నట్టే ఇప్పుడు కూడా వారితో మమేకమయ్యారు.
రాష్ట్ర సాధన కోసం 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ ఏ పాత్ర పోషించారో ఈ 16 రోజులపాటు అదే పాత్రను మరోసారి పోషించారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ వనరులను నాడు ఉమ్మడి పాలకులు కొల్లగొట్టిన వైనాన్ని కండ్లకు కడుతూ ప్రజాచైతన్యాన్ని తట్టిలేపిన విధంగానే, ఇప్పుడూ అదే స్ఫూర్తిని తిరిగి రగిల్చారని తెలంగాణ సమాజం గుర్తుచేసుకుంటున్నది. రాష్ట్ర సాధన అనంతరం పదేండ్లపాటు దేశానికి మార్గదర్శనం చేసిన తెలంగాణ.. కేవలం ఐదు నెలల్లోనే ఆగమైన వైనాన్ని ప్రజలకు విడమరచి చెప్పారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ను, బీఆర్ఎస్ నుంచి తెలంగాణను వేరుగా చూడలేరని, అలా వేరుగా చూడాలని కలలుగన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆశలు అడియాశలే అయ్యాయనడానికి భారీ బహిరంగ సభలను తలపించిన రోడ్‌షోలకు ప్రజల నుంచి వచ్చిన స్పందనే నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి మరెవ్వరికీ ఉండదని రోడ్‌షోలకు హాజరైన ప్రజలు వ్యాఖ్యానించడం గమనార్హం.
భావోద్వేగానికి ప్రజా భాగస్వామ్యం తోడైతే ఏం జరుగుతుందో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నేతలకు బాగా తెలుసు. ఆ భావోద్వేగం కేసీఆరై ముడిపడితే ఎలా ఉంటుందో మరోసారి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలకు తెలిసొచ్చింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సహా ఎవరెన్ని మాటలు చెప్పినా తెలంగాణ ప్రజలకు ఎక్కదు. అదే కేసీఆర్ చెప్తే మాత్రం వినడమే కాదు ఆచరిస్తారు. ఆ ఆచరణే తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గాన్ని వేసింది. సాధించిన రాష్ర్టాన్ని దేశంలో అనేక రంగాల్లో నంబర్ వన్‌గా నిలిపింది. నిజాల ఇజాలపై రాజకీయాలు చేసి ప్రజామోదం పొందిన కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్, బీజేపీలు చేసిన ప్రయత్నాలు ఎంతోకాలం నిలబడలేవని పార్లమెంట్ ఎన్నికల ప్రచారసరళి తేల్చిచెప్పింది. ఈ 17 రోజుల్లో కేసీఆర్ తన ప్రసంగంతో ప్రజలను మమేకం చేశారు. స్థానిక అంశాలను లేవనెత్తడమే కాకుండా అంతకు ముందున్న ఆయన శైలికి విభిన్నతను జోడించారు. ‘కల్యాణలక్ష్మికి లక్ష రూపాయలతోపాటు తులం బంగారం వచ్చిండట కదా మీ జగిత్యాలలో..? నిజమేనా? రూ.2 లక్షల రుణమాఫీ వరంగల్ రైతులకు కాంగ్రెస్ సర్కార్ వేసిందట కదా? మోదీ అందరికీ ఇస్తానన్న రూ.15 లక్షలు కరీంనగర్లో వచ్చాయట కదా? నిజమేనా? మహిళలకు నెలకు రూ.2500 బ్యాంకుల్లో వేస్తున్నరట కదా.. నిజమేనా? చేవెళ్లల్లో వచ్చాయని రాహుల్‌గాంధీ చెప్తున్నడు కదా? నిజమేనా? ఇలా ఆయా ప్రాంతాల ప్రజా సమూహాలను భాగస్వామ్యం చేస్తూ కేసీఆర్ చేసిన ఛలోక్తులు జనంలోకి బాగా వెళ్లాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ప్రశ్నలు శరాఘాతంగా మారాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ చేసిన ప్రచారానికి స్పష్టమైన తేడా కనిపించింది. బీఆర్ఎస్ పార్టీకి యువత దూరం అయిందని, యువతలో బీఆర్ఎస్కు ఆదరణ లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేసీఆర్ బస్సుయాత్ర పటాపంచలు చేసింది. కేసీఆర్ ప్రసంగించిన రోడ్‌షోలు, బస్సుయాత్రలో అత్యధికంగా పాల్గొన్నది యువతే కావడం గమనార్హం. కేసీఆర్ సైతం ప్రతి ప్రసంగంలో యువతకు భవిష్యత్తు కార్యాచరణను దిశానిర్దేశం చేశారు. తన పార్టీ శ్రేణులకు ఏ స్థాయిలో కేసీఆర్ మార్గనిర్దేశనం చేశారో అదే స్థాయిలో యువతకు ప్రబోధించారు. బస్సుయాత్రల్లో కేసీఆర్ కనిపించగానే ‘జై కేసీఆర్..’ అని యువత నినదిస్తూ ముందుకు సాగింది. తమ ప్రాంత పొలిమేరల దగ్గర కేసీఆర్ కోసం వేచి ఉండి, ఆయన బస్సు కనిపించగానే కేరింతలు కొడుతూ ర్యాలీగా కేసీఆర్‌ను తోడ్కొని రావడం ప్రతిచోటా యువత తమ ధర్మంగా భావించింది. అనేకచోట్ల పార్టీలకు అతీతంగా గ్రామ యువజన సంఘాలు బ్యానర్లు పట్టుకొని కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన దృశ్యాలు ఉద్యమ కాలం నాటి సన్నివేశాలను గుర్తుచేశాయి.
మోదీ చెప్పిన సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైంది? అమృత్కాల్ వచ్చిందా? అచ్చేదిన్ వచ్చిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? జన్‌ధన్ ఖాతా ఏమైంది? అంటే ఏమీ రాలేదు. అంతా గ్యాస్.. ట్రాష్. డబ్బాలో రాళ్లు వేసినట్టు ఊపటం తప్ప, ఏ పేదకూ ఏం జరగలె.