ముదురుతున్న ఎండలు.. పాతాళానికి పడిపోతున్న భూగర్భజలాలు.. సాగునీళ్లందక నెర్రెలు వారుతున్న వరి పొలాలు.. పొట్ట దశలో మాడిపోతున్న పైరు అన్నదాతలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. కండ్ల ముందే ఎండుతున్న పంటలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు తమ పొలాలను పశువులకు వదిలివేయగా, కొద్ది రోజుల్లో ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలకపోతే ఆశలు వదులుకోవాల్సిందేనని మిగతా రైతులు రందిపడుతున్నారు. సర్కారు కనుకరించి సాగునీళ్లు వదిలి చివరి దశలో ఉన్న పంటలకు ప్రాణం పోయాలని వేడుకుంటున్నారు.
– దేవరుప్పుల/ డోర్నకల్, మార్చి 8
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి. దేవాదుల నీరు వదులుతారన్న ఆశతో రైతులు రెండో పంటగా వందలాది ఎకరాల్లో వరినాట్లు, మక్కజొన్న వేశారు. తీరా ఎండలు ముదిరి, భూగర్భ జలాలు అడుగంటి.., బోర్లు వట్టిపోయి పంటలు ఎండుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే నడి ఎండల్లో ఇంకెలా ఉంటుందోనని ఆవేదన చెందుతున్నారు. మండలంలోని లకావత్ తండా, దుబ్బతండాలో వరి, మక్కజొన్న పంటలు పొట్ట దశలో ఎండుతున్నాయని రైతులు వాపోతున్నారు. దేవాదుల నీటితో కాల్వలు పారితే భూగర్భ జలాలు పెరిగి బోర్లు నడుస్తాయని, వెంటనే నీళ్లు వదలాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి చెన్నూరు రిజర్వాయర్‌కు వచ్చే 4 ఎల్ కాల్వకు స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి నీరు వదిలితేనే రెండో పంట చేతికొస్తుందని అక్కడి చెబుతున్నారు. మరోవైపు 4 ఎల్ నుంచి ధర్మాపురం వచ్చే కాల్వలో పూడిక పేరుకుపోయిందని నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి రైతుల ఆవేదన అర్ధం చేసుకొని వెంటనే పూడికతీత పనులు చేపట్టి, దేవాదుల నీరు వదలాలని రైతులు కోరుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వరిపొలాలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ కాల్వల్లో కాళేశ్వరం జలాలు పారక మున్నేరు, ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పొట్ట దశలో ఉన్న పంట దెబ్బతింటున్నది. సాగునీరందక వరి పొలాలు నెర్రెలు వారుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా సాగునీళ్లు వదలడంతో రైతులు సంతోషంగా రెండు పంటలు పండించుకున్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి లేదు. పంటలు ఎండిపోతున్నా ఇటు వైపు కన్నెత్తి చూసేవారు లేరని ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వదిలి చివరి దశలో ఉన్న పంటలకు ప్రాణం పోయాలని వేడుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ కాళేశ్వర జలాలను ఎస్సారెస్సీ కాల్వల ద ద్వారా విడుదల చేసి పంట పొలాలకు సాగునీరు అందించాని వేడుకుంటున్నారు.
రూ.వెయ్యికి గొర్రెల మేతకు అమ్మిన..
రెండు ఎకరాల్లో యాసంగి నాటు వేస్తే ఎకరం ఎండింది. మిగతా ఎకరానికి వరుస తడులు పెడుతున్న. అయినా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఎండిన ఎకరం వరి పంటలో పశువులు మేపుతున్న. రూ.వెయ్యికి గొర్రెలు మేపుకోవడానికి గొర్రెలకాపరికి అమ్మిన. దేవాదుల నీరు వదిలితేనే ఎండిన బోర్లు మళ్ల నడుస్తయి. యాసంగి పంటలు చేతికొస్తయి. చెన్నూరు కాల్వ ఎండిపోయింది. నీళ్లు వదులుతారప్న ఆశలు సన్నగిల్లినయి. నోటికాడి బుక్క మట్టి పాలవుతున్నది. పట్టించుకునే వారే లేరు.
– లకావత్ హరిసింగ్, రైతు, దుబ్బతండా
సాగు నీరు అందించాలి
సాగు నీరు లేక వరిపంట ఎండిపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాసంగి పంటలకు పుష్కలంగా సాగునీరు అందించారు. రెండు పంటలు పండించినం. ఇప్పుడు నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వానికి సోయి లేదు. వెంటనే ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలు వదిలి చెరువులు, కుంటలు నింపి సాగు నీరు అందించాలి.
– ధరంసోత్ విజయ్, మన్నెగూడెం