Avocado | అవకాడో ఇటీవలి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారంగా విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఫిట్‌నెస్‌పై అవగాహన పెరగడంతోపాటు బరువు నియంత్రణకు ఉపయోగపడే ఆహారాల జాబితాలో అవకాడోకు ప్రత్యేక స్థానం లభించింది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతోపాటు బరువు తగ్గే ఆహార ప్రణాళికల్లో కూడా దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అవకాడోను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవకాడోలో 20కిపైగా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి5, విటమిన్ బి6 సమృద్ధిగా లభిస్తాయి. అలాగే మెగ్నిషియం, మాంగనీస్, రాగి, ఇనుము, జింక్, ఫాస్ఫరస్, విటమిన్ ఎ వంటి పోషకాలు కూడా ఇందులో ఉంటాయి.
అవకాడోలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఒలీక్ యాసిడ్ అనే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు. ఈ కారణంగా అవకాడో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని, అవకాడో నూనెను వంటల్లో కూడా ఉపయోగించవచ్చని తెలియజేస్తున్నారు. అవకాడో శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను తగ్గించి, హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) స్థాయిలను పెంచడంలో దోహదపడుతుందని చెబుతున్నారు. దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది ఉపయోగపడుతుంది.
అవకాడోను రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. దీనిని సలాడ్లు, అవకాడో టోస్ట్ లేదా ఇతర వంటకాలలో ఉపయోగించవచ్చు. అవకాడో మృదువైన, క్రీమీ స్వభావం కలిగి ఉండటంతో ఇతర పదార్థాలతో సులభంగా కలిసిపోతుంది. వెల్లుల్లి, ఉప్పు, నిమ్మరసం వంటి పదార్థాలతో కలిపి గ్వాకమోలే అనే ప్రసిద్ధ డిప్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అవకాడోలో అరటిపండ్ల కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. పొటాషియం శరీరంలోని కణాల పనితీరుకు అవసరమైన ఖనిజం. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటంతోపాటు గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో దోహదపడుతుంది.
అవకాడో సారాలు కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే ఆస్టియోఆర్థరైటిస్ రోగులకు కొంత ఉపశమనం కలిగిస్తాయి. అవకాడోను బరువు తగ్గించే ఆహార ప్రణాళికల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండగా కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువసేపు ఆకలి అవకుండా ఉండటానికి సహాయపడటంతోపాటు మొత్తం కేలరీల వినియోగాన్ని తగ్గించడంలో దోహదపడుతుంది. అవకాడోలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు మలబద్ధకం సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. అవకాడోలో ల్యూటిన్, జియాజాంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే కంటిశుక్లం (క్యాటరాక్ట్), మాక్యులర్ డిజెనరేషన్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.