E20 Fuel : ఈ20 పెట్రోల్ వినియోగంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. వినియోగదారుల డిమాండ్‌కు తలొగ్గిన కేంద్రం ఇథనాల్ లేని పెట్రోల్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ఒక ప్రచారం మొదలైంది. అటు ఈ20 పెట్రోల్‌తోపాటు, ఇథనాల్ కలపని పెట్రోల్ కూడా మంగళవారం, ఆగష్టు 5 నుంచి అందుబాటులో ఉంటుందంటూ కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో ఈ20 పెట్రోల్ లీటర్‌కు రూ.105-రూ.110 వరకు ఉంటుందంటూ ధరపై కూడా ప్రచారం మొదలైంది. వీటన్నింటికీ సంబంధించి ఒక గ్రాఫిక్ ఇమేజ్ కూడా ఎస్ఎంలో షేర్ అవుతోంది. దీంతో ఈ అంశంపై ఏకంగా కేంద్రం స్పందించింది. కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ అంటూ బదులిచ్చింది. ఆన్లైన్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. కేంద్రం అనురిస్తున్న చమురు పాలసీ, ధరల్లో ఎలాంటి మార్పులు లేవని, దీనిపై జరుగుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేసింది. ఇందుకోసం అవసరమైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) అధికారిక ఖాతాల్ని పరిశీలించాలని సూచించింది.
ఇటువంటివి ప్రచారం చేసేముందు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని కోరింది. ఆన్లైన్లో కనిపించేదంతా నిజం కాదని స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ20 చమురు విషయంలో ఎన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా.. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభలో అధికారికంగా ప్రకటించింది.