భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడైన అభిజీత్ దిప్కే పేర్కొన్నారు. ప్రజా సేవలో తాను స్పష్టంగా విఫలమయ్యానని ఆయన వాపోయారు. ఈ మేరకు ఒక వ్యంగ్య, నకిలీ రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Abhijeet Dipke) మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో గిరిజన గ్రామాలకు చెందిన 30 మందికి పైగా పిల్లల అనారోగ్యం బారినపడి మరణించారు. తట్టు, మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తి వల్ల వందలాది మంది పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, శనివారం అభిజీత్ దిప్కే ఆయా గిరిజన గ్రామాల్లో పర్యటించారు. మరణించిన గిరిజన పిల్లల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన మహిళ అభిజిత్ దీప్కే కారు వద్దకు వచ్చింది. శవ రాజకీయాలు చేయడానికి వచ్చారా? అని ఆమె ప్రశ్నించింది. ఆలస్యంగా సందర్శించడంపై ఆ యువతి నిలదీసింది. తన పర్యటన ఆలస్యానికి అభిజిత్ దీప్కే క్షమాపణలు చెప్పారు. మరింతగా ప్రశ్నలు లేవనెత్తడంతో సీజేపీ కార్యకర్తలు ఆయనను మరో కారులో అక్కడి నుంచి తరలించారు.
మరోవైపు బాధిత గిరిజన కుటుంబాల పరామర్శపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తనను హేళన చేయడంపై అభిజిత్ దీప్కే వ్యంగ్యంగా స్పందించారు. ఆదివారం సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య నకిలీ ‘రాజీనామా లేఖ’ను ఆయన పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి నేను తక్షణమే రాజీనామా చేస్తున్నా. మధ్యప్రదేశ్ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఆ అవకాశంలో నేను స్పష్టంగా విఫలమయ్యాను’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, అధికారిక చిహ్నం, సీఎంవో చిరునామా, సంతకంతో సహా అసలైనదిగా కనిపించేలా మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్‌ను ఉద్దేశించి రాసిన ఈ నకిలీ రాజీనామా లేఖను అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో షేర్ చేశారు. గిరిజన పిల్లల మరణాలకు తానే బాధ్యత వహిస్తున్నట్లు అందులో ప్రకటించారు. ‘బాలాఘాట్‌లో 30 మందికి పైగా గిరిజన పిల్లలు మరణించిన తర్వాత, సీఎం పదవిలో కొనసాగడానికి నా అంతరాత్మ అంగీకరించడం లేదు’ అని పేర్కొన్నారు.
అయితే గిరిజనుల నిరసనల తర్వాతే పరిహారాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచారని అభిజిత్ దీప్కే ఆ లేఖలో విమర్శించారు. ఒకవేళ మంత్రులు లేదా ఎమ్మెల్యేల పిల్లలైతే ఇదే పరిహారం సరిపోతుందని భావించేవారా? అని ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ అధికారులను బాధ్యులను చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆరోగ్యం, తాగునీరు, విద్య, ఇతర రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన తీరును ఈ వ్యంగ్య రాజీనామా లేఖలో ఆయన ఎత్తిచూపారు.
మరోవైపు గిరిజన పిల్లల మరణాలపై దాఖలైన పిటిషన్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. తాగునీరు, పారిశుధ్యం, పోషకాహార లోప నివారణ చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖ, బాలాఘాట్ కలెక్టర్, ఇతర అధికారుల స్పందన కోరింది.

Abhijeet Dipke Letter