సిటీబ్యూరో: గ్లకోమా వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని ‘సైలెంట్ థెఫ్ట్ ఆఫ్ సైట్’ అంటారు. అంటే నెమ్మదిగా వచ్చి కంటి చూపును దోచుకెళ్లే దొంగగా పరిగణిస్తారు. రోజు రోజుకు ఈ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరుగుతుండడంతో 2030 సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా గ్లకోమా బాధితుల సంఖ్య 95 మిలియన్లకు చేరుకునే ప్రమాదం లేకపోలేదని కంటి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా మార్చి 2వ వారాన్ని గ్లకోమా అవగాహన వారంగా పరిగణిస్తున్నారు. ఇందులోభాగంగా వారం రోజుల పాటు(ఈనెల 8-14 వరకు) ప్రజలకు గ్లకోమా వ్యాధిపై అవగాహన కల్పిస్తామని సరోజినీదేవి కంటి దవాఖాన గ్లకోమా విభాగాధిపతి డాక్టర్ పి. వెంకటరత్నం తెలిపారు.కాగా, గ్లకోమా అవగాహన వారోత్సవాల్లో భాగంగా సరోజినీదేవి కంటి దవాఖాన ఆధ్వర్యంలో ఆదివారం దవాఖాన నుంచి మాసబ్‌ట్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ముందుగా గుర్తిస్తే..
దేశంలో గ్లకోమా వ్యాధి బాధితుల సంఖ్య 1.20 కోట్ల మంది ఉన్నట్లు అధ్యయనాల ద్వారా తెలుస్తున్నది. ఈ వ్యాధి గ్రస్తుల్లో కేవలం 10 శాతం మంది రోగులకు మాత్రమే జబ్బు ఉన్నట్లు తెలుసు. మిగిలిన వారికి వ్యాధి ఉన్న విషయం తెలియకుండానే జీవిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనే 80వేల మంది రోగులు ఉన్నట్లు అంచనా. గ్లకోమా వ్యాధిని ముందస్తుగానే గుర్తించగలిగితే దాని వల్ల ఏర్పడే అంధత్వాన్ని నివారించవచ్చు.
– డా వెంకటరత్నం, గ్లకోమా విభాగాధిపతి, సరోజినిదేవి కంటి దవాఖాన