Vrushakarma | యువ సామ్రాట్ నాగ చైతన్య, దర్శకుడు కార్తీక్ వర్మ దండు కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వృషకర్మ’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మిథికల్ ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘వృషకర్మ’ చిత్రబృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. వైజాగ్‌లోని గ్లాస్ బ్రిడ్జిపై టీమ్ మొత్తం కలిసి ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహించింది. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, కమెడియన్ సత్య, నటుడు జయరామ్, దర్శకుడు కార్తీక్ దండు, నిర్మాతలతో పాటు చిత్రబృందంలోని పలువురు సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు, బెలూన్స్ పట్టుకుని దేశభక్తిని చాటుకున్నారు.
“మనకు స్వాతంత్య్రం సాధించి పెట్టేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన ప్రతి ఒక్క వీరుడికీ సెల్యూట్” అంటూ చిత్రబృందం ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం వైజాగ్‌లోనే ‘వృషకర్మ’ షూటింగ్ జరుగుతున్నట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ఇక ‘వృషకర్మ’ విడుదలపై దర్శకుడు కార్తీక్ దండు తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. సినిమాను దసరా బరిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఉన్నందున.. అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. గ్రాఫిక్స్ అనుకున్న స్థాయిలో పూర్తయితే 90 శాతం దసరాకే సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని, ఒకవేళ ఆ డెడ్‌లైన్ మిస్ అయితే డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని కార్తీక్ దండు తెలిపారు.
సినిమా చాలా భారీ స్థాయిలో ఉంటుందని, స్క్రీన్‌ప్లే పూర్తిగా కొత్తగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందని హామీ ఇచ్చారు. ‘వృషకర్మ’లో నాగ చైతన్య ఇప్పటివరకు కనిపించని విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆయన ట్రెజర్ హంటర్‌గా కనిపించనున్నారు. మిథికల్ ఫాంటసీ అంశాలతో పాటు యాక్షన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఈ కథలో కీలకంగా ఉండనున్నాయి. ఇక ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాతో టాలీవుడ్లోకి విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో సినిమాలో హీరో, విలన్ పాత్రల మధ్య పోరు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ‘వృషకర్మ’ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ముఖ్యంగా టీజర్లో కనిపించిన భారీ విజువల్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఓటీటీ హక్కులను జీ5 భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం.