Vishwanath & Sons | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేటర్లలోకి వచ్చేసింది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలను సొంతం చేసుకోగా.. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. మౌత్ టాక్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సినిమాకు బలమైన ఓపెనింగ్ దక్కుతున్నట్లు తెలుస్తోంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు టికెట్ కౌంటర్ల వద్ద మంచి డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో గత 24 గంటల్లో 5,05,710 టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. అంటే కేవలం ఒక్క రోజులోనే 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం విశేషంగా మారింది. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్, ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తికి ఈ ప్రీ-సేల్స్ అద్దం పడుతున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే సూర్య నటించిన సినిమాలకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ క్లాస్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథ కావడంతో బుకింగ్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. అయితే అంచనాలను మించి టికెట్ల అమ్మకాలు జరగడం చిత్రబృందానికి మంచి బూస్ట్ ఇచ్చింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సాధారణ కుటుంబ కథలను భావోద్వేగాలతో, వినోదాత్మక అంశాలతో తెరకెక్కించడంలో తనదైన శైలిని చూపించిన వెంకీ అట్లూరి.. ఈసారి సూర్యతో కలిసి ఓ భిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సూర్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించగా.. ఆయన పాత్ర చుట్టూ కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, జీవితంలోని అనుబంధాలు ప్రధానంగా సాగుతాయని తెలుస్తోంది. సినిమా విడుదల తర్వాత వస్తున్న స్పందన చూస్తే ప్రేక్షకులు ఈ ఫ్యామిలీ డ్రామాను బాగానే ఆదరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ సినిమాలో మలయాళ బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటించింది. సూర్య, మమితా బైజు జోడీపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వీరి పాత్రలు సినిమాకు మరింత బలాన్ని చేకూర్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు కీలకంగా నిలిచినట్లు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. భారీ స్థాయిలో నిర్మాణ విలువలు ఉండటంతో సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. విడుదలైన వెంటనే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రావడం, మరోవైపు బుక్‌మైషోలో భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతుండటం సినిమాకు కలిసొచ్చే అంశంగా మారింది. ముఖ్యంగా గత 24 గంటల్లో 5.05 లక్షలకు పైగా టికెట్లు సేల్ కావడం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. ఇక ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో థియేటర్లలో ఆక్యుపెన్సీ మరింత పెరిగి, బాక్సాఫీస్ వద్ద సూర్య సినిమాకు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.