– వరండాలో పిల్లలు… గదిలో చీరలు, జ్యూయలరీ, ఆటబొమ్మలు
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 23 : అంగన్వాడీ కేంద్రం అంటే చిన్నారులకు పౌష్టికాహారం… గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సేవలు అందించే చోటు. బూర్గంపహాడ్ మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో ఓ టీచర్ ఏకంగా ఫ్యాన్సీ ఐటమ్స్, ఫ్యాన్సీ జ్యూయరీస్, ఆటబొమ్మలు ఉంచి వ్యాపారం చేస్తున్న ఘటన బుధవారం ఇరవెండిలో తల్లుల ద్వారా ఈ ఘటన వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ఇరవెండి 2 అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులను సంబంధిత టీచర్ మేరి వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతూ గత కొంతకాలంగా పోషకాహారం అందిస్తోంది. అంగన్వాడీ స్కూల్‌కు కేటాయించిన గదిలో అటబొమ్మలు ఉండటంతో పాటు మరో గదిలో బీరువా, ఫ్యాన్సీ ఐటమ్స్, చీరలు, జ్యూయలరీ మెటీరియల్స్ ఉన్నాయి. అయితే చిన్నారులు ఆ గదిలోకి వెళ్లి పొరపాటున ఆటబొమ్మలను ముట్టుకుంటే ఆ బొమ్మ కావాలంటే దాని ధర ఇంత… దీని ధర అంత అంటూ పిల్లలకు చెబుతూ వాటిని కొనుక్కోవాలని హుకుం జారీచేస్తుందని బాధిత తల్లులు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నట్లుగా చూపుతూ వీడియో పోస్టు చేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న ఫ్యాన్సీ వ్యాపారం దందా వెలుగులోకి వచ్చింది.
అంగన్వాడీ టీచర్ మేరీ తనకు కేటాయించిన గదిలో పిల్లలకు పాఠాలు చెపాల్సి ఉండగా గదిని పక్కన పెట్టి బయట వరండాలో కేంద్రం నిర్వహిస్తోంది. ఆ గదిలో ఆటబొమ్మలు, చీరలు, జ్యూయలరీ కిట్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టి గతకొంతకాలంగా అమ్మకాలు సాగిస్తోంది. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లులు, బాలింతలకు మాత్రం గదిలో కోడిగుడ్లు, ఇతర ఫీడింగ్ అందించి పంపుతోంది. అయితే ఇది గమనించిన చిన్నారి తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్సీ వ్యాపారం గురించి స్థానిక సెక్రటరీ, సూపర్వైజర్లకు తెలుపడంతో అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్న వారు తనిఖీ చేయగా అంగన్వాడీ టీచర్ మేరీ నిర్వాహం బయటపడింది.
ఇరవెండి -2 అంగన్వాడీ కేంద్రాన్ని పంచాయతీ సర్పంచ్ గుండి బాబూరావు, కార్యదర్శి స్పందనతో పాటు సెక్టార్ సూపర్వైజర్ సక్కుబాయి తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో టీచర్ విక్రయించడానికి ఉన్న ఆట బొమ్మలు, ఫ్యాన్సీ ఐటమ్స్, చీరలు, జ్యూయలరీ మెటీరియల్స్, బిస్కెట్లు, చాక్లెట్లు ఇలా అన్నిరకాల ఫ్యాన్సీ ఐటమ్స్‌ను పరిశీలించి వాస్తవాన్ని గ్రహించారు. తక్షణమే వాటిని బయటకు తరలించడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీ టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీపీవోకు విషయాన్ని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం ఆరుబయట వరండాలో కాకుండా గదిలోనే చిన్నారులకు పాఠాలు బోధించాలని, కేంద్రానికి వచ్చే తల్లులు, బాలింతలకు ఫీడింగ్ సక్రమంగా అందించాలని ఆదేశించారు.

ఇరవెండి అంగన్వాడీలో టీచర్ ఫ్యాన్సీ వ్యాపారం