సిద్దిపేట, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తు విత్తిన నాటి నుంచి అమ్ముకునేదాకా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతుల గురించి కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం పట్టించు కోవడం లేదు. జిల్లా ఇన్చార్జి మంత్రితో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు సైతం రైతుల సమస్యలపై కనీసం సమీక్ష చేసిన దాఖలాలు లేవు. యాసంగిలో వరి పంటకు బదులుగా పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. వానకాలంలో అంతర పంటలో భాగంగా కంది సాగు చేశారు.
ఇవ్వాళ పంటలు చేతికి వచ్చాయి. పంట కోతలు పూర్తవుతున్నాయి. ఇంత వరకు ప్రభుత్వం వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. వారం పది రోజులుగా కంది రైతులు సిద్దిపేట మార్కెట్లో పడిగాపులు కాస్తున్నారు. పొద్దుతిరుగుడు రైతులు తమ ధాన్యాన్ని తీసుకువచ్చి కేంద్రాల ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. మొక్కజొన్న రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ఈ మూడు పంటలకు సంబంధించి కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా నంగునూరు మండల రైతులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.
రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్
ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ సర్కార్ విస్మరించింది. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కంది, సోయా, శనగ పంటలు సాగు చేశారు. ప్రస్తుతం ఆయా పంటలు కోతకు వచ్చాయి. చాలా మంది రైతులు తమ పంటలను కోసి ధాన్యం అమ్ముకోవడానికి పది రోజులుగా సిద్ధవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇటీవల కొన్ని మార్కెట్లలో కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అవి నామమాత్రమే అని చెప్పాలి.
మొక్కజొన్న క్వింటాల్‌కు రూ. 2400, కందులు క్వింటాల్‌కు రూ. 8,000, పెసర్లు క్వింటాల్‌కు రూ. 8,768, వేరుశనగ రూ. 7,263, పొద్దుతిరుగుడు క్వింటాల్‌కు రూ. 7,721, సోయాబిన్ క్వింటాల్‌కు రూ. 5,328 మద్దతు ధర ప్రకటించింది. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, కొన్నిచోట్ల కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం త్వరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమకు మద్దతు ధర వస్తుందని ఆశ పడుతున్న రైతుల ఆశలు ఆడియాసలవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
గతంలో ప్రకృతి వైపరీత్యాలతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు నేటికీ పరిహారం అందలేదు. వందల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ప్రతి యేటా నష్టపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కర్షకులు వాపోతున్నారు. కనీసం పండించిన పంటైనా అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు మండిపడుతున్నారు.కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్ కు రూ.300 నుంచి రూ. 600 తకువ ధరకు విక్రయించాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవడం, అసలు ఏర్పాటు చేయకపోవడం, చెల్లింపులు ఆలస్యం కావడం, రవాణా సదుపాయాలలేమి వంటి సమస్యలు రైతులను ఆర్థికంగా కుదే లు చేస్తున్నాయి.
మార్కెట్లో రోజుల తరబడి పడిగాపులు
కందుల కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సదుపాయాలు కూడా లేవు.గతంలో మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కందులు కొనుగోలు చేసేవారు. కేంద్రాలు ఏర్పాటు చేసిన స్థానిక మార్కెట్లో ఫ్యాక్స్ లేదా మార్కెట్ అధికారులు కొనుగోలు చేసి రైతులకు పేమెంట్ చేసేవారు. ఈ సంవత్సరం ఎన్ఎఫ్సీ సంస్థ వారు కందులు కొనుగోలు చేస్తున్నారు. ఈ సంస్థ ఉద్యోగులు సర్టిఫైడ్ చేస్తేనే ఆ రైతు వద్ద కందులు కొనుగొలు చేయాలి,వారు సర్టిఫైడ్ చేశాక మార్కెట్ ఉద్యోగులు కానీ అక్కడి ఫ్యాక్స్ ఉద్యోగులు గానీ రైతులకు గన్నీ బ్యాగులు ఇచ్చి కందులను కొనుగోలు చేస్తున్నారు.కొనుగోలు చేసిన రైతుల వివరాలను నమోదు చేసి వారికి పేమెంట్ చెల్లిస్తున్నారు. ఎన్ఎఫ్సీ సర్టిఫైడ్ చేయకుండా ఏఒక్క రైతు కందులను కొనుగోలు చేయడానికి వీలు లేదు. దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఒక్కో రైతు మార్కెట్లో పదిరోజులకు పైగా పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక ఎకరానికి కేవలం ఆరు క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎకరానికి సరాసరి ఏడు నుంచి 8 క్వింటాళ్ల వరకు ధాన్యం వస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు క్వింటాళ్లు కొనుగోలు చేస్తే మిగతా రెండు క్వింటాళ్లు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోతున్నారు. కొన్ని మార్కెట్లలో ప్రైవేట్ వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కందులను కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోతే.. సాకులు చెబుతున్నారు. మాశ్చర్ రాలేదని రోజుల తరబడి మార్కెట్లోనే ఉంటున్నామని రైతులు వాపోతున్నారు. మార్కెట్ అధికారులు కొంతమంది వ్యాపారులు కుమ్మక్కై నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.