Karnataka : పాకిస్తాన్ ఐఎస్ఐఎస్ ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల్ని యూపీ పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారంతో ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (యూపీ ఏటీఎస్) రంగంలోకి దిగింది. యూపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పాకిస్తాన్లోని ఐఎస్ఐఎస్ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారని, ఆ సంస్థ కోసం వీరు పని చేస్తున్నారనేది ఈ సమాచారం.
దీంతో వారిపై నిఘా పెట్టిన ఏటీఎస్ పోలీసులు వారు కర్ణాటకలోని కలబురాగి జిల్లాలోని, ఉప్పలం గ్రామ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూనే, పాక్ కోసం కూడా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి కోసం కర్ణాటక వెళ్లిన ఏటీఎస్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిని యూపీకి చెందిన మొహమ్మద్ సమీర్, సల్మాన్గా గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. పాకిస్తాన్కు, ఐఎస్ఐఎస్కు గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
వారితో ఎలా సంప్రదింపులు జరుపుతారు, వారి లక్ష్యాలు వంటి వివరాలపై ప్రశ్నిస్తున్నారు. నిందితుల దగ్గరి నుంచి కొన్ని మ్యాప్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మ్యాప్స్ ఎందుకున్నాయి.. వాటితో ఏం చేయదలచుకున్నారు అనే విషయాల్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులపై యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది.