Khairatabad Ganesh | హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటలకే శోభయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో ఆలస్యంగా ఊరేగింపు మొదలైంది.
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల మహాగణపతిని ప్రత్యేక టస్కర్ వాహనంపైకి చేర్చారు. విగ్రహాన్ని సురక్షితంగా తరలించేందుకు అవసరమైన వెల్డింగ్, ఇతర సాంకేతిక పనులను పూర్తి చేసిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. విజయవాడ నుంచి తీసుకొచ్చిన భారీ టస్కర్ వాహనంపై గణనాథుడిని తరలిస్తున్నారు.
ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు సాగనుంది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 5 వద్ద 69 అడుగుల ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేయనున్నారు.
ఈసారి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని మధ్యాహ్నం 2 గంటల్లోపు పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. డీజేలకు అనుమతి లేకపోవడంతో సన్నాయి మేళాల మధ్య మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. నిమజ్జనానికి ముందు గురువారం రాత్రి 8 గంటలకు ఉత్సవ కమిటీ సభ్యులు గణనాథుడికి చివరి పూజలు నిర్వహించారు.
మరోవైపు ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో గణేశ్ నిమజ్జన సందడి నెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణనాథులను తీసుకొచ్చే వాహనాలతో ప్రధాన మార్గాలు సందడిగా మారాయి. ఖైరతాబాద్ బడా గణేశుడికి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, సచివాలయం పరిసరాల్లోనూ భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర సాగే మార్గాన్ని పోలీసులు నియంత్రించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా చర్యలు చేపట్టారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజధాని శివారు ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్ వరకు నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారు 45 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోనే సుమారు వెయ్యి మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.