హైదరాబాద్‌లో భారీ గంజాయి ముఠాను ఈగల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు గంజాయి సరఫరాకు ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇక, ఈ ముఠాను పట్టుకునే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్ని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ నర్సింగ్ రావు గురువారం మీడియాకు వెల్లడించారు. ఇటీవల బేగంపేట్ ఎయిర్‌పోర్టు వద్ద గంజాయాతో ఉన్న ఒక నిందితుడిని ఈగల్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడివద్ద నుంచి 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి విక్రయిస్తున్న భారీ ముఠా వివరాలు వెల్లడించాడు.
కిరణ్, దుర్గాప్రసాద్, కమలాకర్ సహా పలువురు నిందితులు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు. నిందితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈగల్ ఫోర్స్ పోలీసులు బాలానగర్‌లోని, రాజీవ్ కాలనీలో కిరణ్, ఇతర నిందితులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై దాడులు నిర్వహించారు. దాదాపు 40 మంది పోలీసులు ఇందులో పాల్గొన్నారు. అయితే, పోలీసుల రాకను గమనించిన నిందితులు పోలీసులపైకి ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కల్ని వదిలాడు. ఇదే సమయంలో పోలీసుల్ని చూసిన కీలక నిందితుడు బొల్లా కిరణ్ పోలీసులపైకి దాడికి యత్నించాడు. అనంతరం అపార్ట్మెంట్ నాలుగో అంతస్తునుంచి దూకి ఆత్మహత్య డ్రామా ఆడినట్లు తెలుస్తోంది. అయితే, భారీగా మోహరించిన పోలీసులు నిందితులు కిరణ్, అతడి భార్యతోపాటు, కమలాకర్, దుర్గా ప్రసాద్ అనే నిందితులను అరెస్టు చేశారు.
వీరి వద్ద నుంచి 14 కేజీల గంజాయి, ఒక ఎయిర్‌గన్, కార్, బైక్, స్మార్ట్ఫోన్లను సీజ్ చేశారు. అలాగే, ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితుల ముఠాను కూడా అరెస్టు చేశారు. గంజాయి సరఫరాలో కిరణ్ ముఠా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. వీరు డెడ్ డ్రాప్ పద్ధతిలో విక్రయాలు సాగిస్తున్నారు. ఇందుకోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వీరు తాము నివాసం ఉంటున్న ప్రాంతాల్లో కాకుండా, ఇతర ప్రాంతాల్లో గంజాయి పెట్టి, వాటి ఫొటోలు వాట్సాప్‌లో షేర్ చేస్తున్నారు. ఆ తర్వాత మిగతా ముఠా సభ్యులు డబ్బులు చెల్లించి, ఆ గంజాయి తీసుకుంటున్నారు. వారు వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
బైక్ ట్యాక్సీలపై కూడా గంజాయి సరఫరా చేస్తున్నారు. మూడు బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బు స్వీకరిస్తున్నారు. 2022 నుంచి ఈ ముఠా డ్రగ్స్ విక్రయిస్తోంది. ఇప్పటివరకు వీరి వద్ద నుంచి దాదాపు 2,300 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. వీరి తాజా జాబితాలో ఉన్న 100 మందికి టెస్ట్ నిర్వహించగా, 72 మందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.