Indo-Pakistan : సరిహద్దు గుండా దేశంలోకి అక్రమంగా చొరబాటుకు యత్నించిన ఇద్దరు పాకిస్తానీలను భారత జవాన్లు కాల్చి చంపారు. ఈ ఘటన పంజాబ్, తార్న్ తరాన్ సెక్టార్ వద్ద రాజొకే గ్రామం వద్ద ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. పాకిస్తాన్లోని చత్తన్వాలె ప్రాంతం నుంచి ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అక్రమంగా సరిహద్దు నుంచి ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
దీన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది గమనించారు. వెంటనే వారికి ఆగిపోవాలని హెచ్చరిక జారీ చేశారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు ఇండియాలోకి చొరబాటు ప్రయత్నాన్ని ఆపలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు స్పందించారు. చొరబాటుదారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొక చొరబాటుదారుడు తిరిగి పాకిస్తాన్ వైపు పారిపోయాడు. పంజాబ్ ప్రాంతంలో సరిహద్దు నుంచి అనేక అక్రమ చొరబాట్లు జరుగుతున్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు ఇక్కడ మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి.
దీనిలో భాగంగానే తాజా చొరబాటును ఆపగలిగారు. తమ హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే కాల్పులు జరిపామని బీఎస్ఎఫ్ ప్రకటించింది. గత జూలైలో కూడా ఒక చొరబాటుదారుడు ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. కానీ, జవాన్లు కాల్పులు జరపడంతో తిరిగి వెళ్లిపోయాడు. ఇటీవలి కాలంలో కేంద్రం సరిహద్దులో భద్రతను మరింత పెంచింది. అలాగే, అనేక చోట్ల కంచె కూడా నిర్మిస్తోంది.