హంద్రీనీవా దూకుడు కల్వకుర్తి మందగమనం
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తరువాత కృష్ణమ్మ పరుగులు మందగించాయి. శ్రీశైలం జలాశయంలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా పక్క రాష్ర్టానికి అప్పజెప్పడంతో అక్కడ కృష్ణమ్మ దూకుడు పెరిగింది. ఫలితంగా హంద్రీనీవా రికార్డు స్థాయిలో 250 రోజుల్లో 53.74 టీఎంసీలను శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోసింది. హంద్రీనీవా కంటే చాలా రెట్లు పెద్ద ప్రాజెక్టు అయిన ఎంజీకేఎల్ఐ మాత్రం ఈ సీజన్ కేవలం 21 టీఎంసీలు మాత్రమే తీసుకోగలిగింది.
- శ్రీశైలం నుంచి హంద్రీనీవా ఎత్తిపోసింది 53.74 టీఎంసీలు
- ఎంజీకేఎల్‌ఐకి వాడుకున్నది కేవలం 21 టీఎంసీలే
- ఏపీ సర్కార్‌ను కట్టడి చేయలేకపోతున్న రేవంత్ సర్కార్
- తెలంగాణ వాటాను ఎందుకు ఎత్తిపోయరని రైతుల మండిపాటు
కొల్లాపూర్, నవంబర్ 22 : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తరువాత కృష్ణమ్మ పరుగులు మందగించాయి. శ్రీశైలం జలాశయంలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా పక్క రాష్ర్టానికి అప్పజెప్పడంతో అక్కడ కృష్ణమ్మ దూకుడు పెరిగింది. ఫలితంగా హంద్రీనీవా రికార్డు స్థాయిలో 250 రోజుల్లో 53.74 టీఎంసీలను శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోసింది. హంద్రీనీవా కంటే చాలా రెట్లు పెద్ద ప్రాజెక్టు అయిన ఎంజీకేఎల్ఐ మాత్రం ఈ సీజన్ కేవలం 21 టీఎంసీలు మాత్రమే తీసుకోగలిగింది.
కల్వకుర్తి మందగమనం తెర వెనుక తెలంగాణ సీఎం హస్తం ఉన్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. నీటి కష్టాల్లో కూడా కూతవేటు దూరంలో ఉన్నా సొంత గ్రామానికి కాదని, గురుదక్షిణగా 700 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు సొంత ప్రాంతానికి కృష్ణానది నీళ్లను తరలించేందుకు ఇక్కడి ముఖ్యమంత్రి సహకారం అందిస్తున్నట్టు తెలంగాణ ఉద్యమకారులు, రైతులు ఆరోపిస్తున్నారు. రేవంత్ సర్కార్ తీరుతో కృష్ణా జలాలపై ఆధారపడి నిర్మించిన ఎత్తిపోతల పథకాల పనితీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హంద్రీనీవా 53.74.. కల్వకుర్తి 21 టీఎంసీలు
ఎల్ నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్పడిందని, యాసంగి పంటలను సాగు చెయ్యొద్దని రేవంత్ సర్కార్ తేల్చి చెప్పింది. వానకాలం పంటలకు కూడా సాగు నీరు అందించని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏపీ సర్కార్ గత సీజన్ల కంటే హంద్రీనీవా ద్వారా భారీ ఎత్తున శ్రీశైలం జలాశయం నుంచి నీటిని కొల్లగొడుతున్నా పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. హంద్రీనీవా ప్రాజెక్టులో రెండు దశల కింద 43 పంప్‌హౌస్‌లు, 289 పంపింగ్ మెషీన్లతో ఇప్పటి వరకు 53.74 టీఎంసీలను ఎత్తిపోసినట్టు మెయిల్ సంస్థనే అధికారికంగా ప్రకటించింది. అంటే హంద్రీనీవాకు కృష్ణా బేసిన్ నుంచి కేటాయించిన నీటి వాటా కంటే 14 టీఎంసీల మేర అదనంగా ఎత్తిపోసినట్టు తెలుస్తున్నది.
శ్రీశైలం జలాశయంపైనే ఆధారపడిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జూలై 27 నుంచి ఇప్పటివరకు పంపులు రన్ అవుతున్నా ఎత్తిపోసిన నీళ్లు మాత్రం 21 టీఎంసీలు దాటలేదు. అంటే కృష్ణా బేసిన్‌పై కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కేటాయించిన నీటా వాటాను కూడా ఎంజీకేఎల్ఐ ఎత్తిపోయలేకపోయింది. తెలుగు రాష్ర్టాల్లో లోటు వర్షాలు లేకపోయినా ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణమ్మ పొంగిపొర్లింది. వరద ప్రారంభమైన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలను అక్కడి ప్రభుత్వం ఆన్ చేసింది.
కానీ సాగునీటి కోసం గోసపడుతున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం జూలై 27 వరకు మోటర్లను ఆన్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడితో ఎంజీకేఎల్ఐ మోటర్లను ఆన్ చేసినా దొంగచాటున రాత్రి పూట మోటర్లను బంద్ పెట్టి జనం చూడటానికి పగలు పూట మాత్రమే మోటర్లను నడిపించడంపై రైతులు తీవ్రంగా ఆక్షేపించారు. ఎంజీకేఎల్ మందగమనంతో సీఎం సొంత ప్రాంతానికి కూడా కృష్ణానది నీళ్లు చేరలేదు. చంద్రబాబు మెప్పు కోసం సొంత ప్రాంత రైతులను పస్తులు ఉంచేందుకు రెండో పంట సాగు చేయొద్దని మంత్రులు సూచించడంపై పలువురు విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నారు.
రైతుల ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్
కృష్ణా బేసిన్‌పై ఎంజీకేఎల్ ప్రాజెక్టు పాలమూరు జిల్లాకు చాలా కీలకం. సాగు, తాగునీటికి ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు ప్రధాన వనరుగా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు మొదలు ఎంజీకేఎల్ఐ కింద రైతులు మూడు పంటలు సాగుచేసేవారు. మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క పంటకు కూడా పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వలేని స్థితి నెలకొన్నది. పాలమూరుకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నా ఎంజీకేఎల్ఐ కింద పంటలు ఎండిపోతున్నాయి. శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి ఎంజీకేఎల్ఐ ఇంటేక్వెల్లోకి నీళ్లు వచ్చే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్రోచ్ కెనాల్‌ను రేగుమాన్ గడ్డ వరకు విస్తరించడం జరిగింది. శ్రీశైలం జలాశయంలో నీళ్లున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు సాగునీటి ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతోనే 21 టీఎంసీల వరకు ఎత్తిపోసి చేతులు ఎత్తేసినట్టు ఎంజీకేఎల్ఐ రైతులు పేర్కొంటున్నారు.
ఏపీ ప్రాజెక్టులను బంద్ చేయించాలి
కృష్ణా బేసిన్‌పై ముఖ్యంగా హంద్రీనీవా ప్రాజెక్టుకు కేటాయించిన నీటి వాటా కంటే ఇప్పటికే అదనంగా శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా జరుగుతున్న అక్రమ నీటి దోపిడీని అరికట్టి, ఎంజీకేఎల్ కింద రెండో పంటకు సాగు నీరు ఇవ్వాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులను రెండో పంట వేసుకోవద్దని చెప్పే నాయకులు ఎంజీకేఎల్ఐ కృష్ణా బేసిన్లో పూర్తి వాటాను వినియోగించుకుంటే రెండో పంటకు కూడా సాగునీరు అందించవచ్చనే విషయం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏపీ సర్కార్ నీటి దోపిడీని తెలంగాణ సర్కార్ అరికట్టకపోవడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

