భూములు అమ్మితే సహించం
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ట్రక్ పారు భూముల వేలంపాట అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక చర్చకు దారితీసింది.
- ట్రక్ పార్కు భూముల అమ్మకంపై బీఆర్ఎస్ సమరభేరి
- ఇప్పటికే స్థానికులతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు నిరసన
- ట్రక్ పార్కు భూములను విక్రయిస్తే సహించేది లేదు
- వేలం నిర్ణయాన్ని విరమించుకోకపోతే..హెచ్ఎండీఏ ముట్టడి
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్
- ట్రక్ పార్కు వేలం పాటను నిరసిస్తూ.. శాంతియుత నిరాహార దీక్షా
- గజం భూమి లేకుండా అమ్మితే… భవిష్యత్ తరాలకు సదుపాయాలు ఎలా కల్పిస్తారు?
సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ కాలనీ: కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ట్రక్ పారు భూముల వేలంపాట అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక చర్చకు దారితీసింది. ఈ భూములను విక్రయించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ తన ఆందోళన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా ఈ భూములపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న బాధితులు, స్థానికులతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే నిరసన చేపట్టి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాగా, ‘గజం భూమి కూడా మిగలకుండా అన్నింటినీ అమ్మేస్తే.. భవిష్యత్తరాలకు మౌలిక సదుపాయాలు, ప్రజా అవసరాల కోసం స్థలాలు ఎలా కల్పిస్తారు?’ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రశ్నించారు.ట్రక్ పారు భూములను అమ్మితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ మేరకు ట్రక్ పార్కు వేలం పాటను నిరసిస్తూ..అదివారం నిరాహార దీక్ష చేపట్టారు.
ట్రక్ పార్కు భూములు అమ్మితే సహించేది లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ అన్నారు. వేలం పాటను విరమించుకుని ప్రజా ప్రయోజనాల కోసం భూమిని కేటాయించాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి హెచ్ఎండీఏ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కూకట్పల్లి ట్రక్‌పార్కు భూములు, కేపీహెచ్‌బీ కాలనీలో హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మకాన్ని నిరసిస్తూ….ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, సీపీఎం, సీపీఐ నేతలతో కలిసి ఆదివారం శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలో గజం భూమి లేకుండా అమ్ముకుంటే.. భవిష్యత్‌లో ప్రజలకు కనీస వసతులు కల్పించేందుకు స్థలాలు ఎక్కడి నుంచి వస్తాయన్నారు.
కూకట్పల్లి గ్రామస్తులకు చెందిన స్థలాన్ని నాటి ప్రభుత్వం ప్రజాప్రయోజనాల కోసం కొనుగోలు చేసి ట్రక్పార్కును ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోలు సమయంలో ఈ స్థలాన్ని విక్రయించడం గానీ, వ్యాపారకలాపాలు నిర్వహించవద్దని నిబంధనలు ఉన్నాయన్నారు. హెచ్ఎండీఏ నిబంధనలు ఉల్లంఘించి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాన్ని అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. ఈ నెల 27న వేలంపాట పెట్టారని, దీనిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రక్‌పార్కు స్థలంతో పాటూ…. కేపీహెచ్‌బీ కాలనీలో హౌసింగ్ బోర్డు భూములను సర్కార్ అమ్ముతున్నదని, ఈ ప్రాంతంలో గజం భూమి లేకుండా అమ్మితే… భవిష్యత్‌లో ఇక్కడ క్రీడాప్రాంగణం నిర్మించాలన్నా, పార్కులు ఏర్పాటు చేయాలన్నా, ప్రభుత్వ ఆఫీస్‌లకు పెట్టాలన్నా స్థలాలు లేకుండా పోతాయన్నారు.
కాంక్రీట్ జంగీల్లా మారిన కూకట్‌పల్లిలో ట్రక్‌పార్కు భూములను అమ్మకుండా పార్కుగా అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారని, ప్రభుత్వం ప్రజల విజ్ఞప్తి మేరకు వేలంపాటను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కూకట్‌పల్లిలో త్వరలోనే జనాభ 10 లక్షలకు చేరుకుంటుందని, వారికి మౌలిక వసతులు ఎలా కల్పిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం మొండిగా స్థలాన్ని విక్రయిస్తే సహించేది లేదని, హెచ్ఎండీఏ ఆఫీస్‌ను ముట్టడించి అడ్డుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు దారులు ఈ స్థలాన్ని కొనుగోలు చేయవద్దని, ఎవరైనా కొనుగోలు చేస్తే.. ప్రజలందరితో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టంచేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ భూములను ప్రజలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ప్రజల భూములను అమ్మడం మానుకోవాలి..వామపక్ష నేతలు
ప్రజలకు చెందిన భూములను ప్రభుత్వం అమ్ముకోవడం మానుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. కూకట్‌పల్లిలో, కేపీహెచ్‌బీ కాలనీలో ప్రజలకు ఉపయోగపడే భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలానికి పెట్టడం సరికాదని, వెంటనే వేలంపాటను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా స్థలాలను అమ్మితే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ట్రక్‌పార్కు, హౌసింగ్ బోర్డు స్థలాలు అమ్మకుండా కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని, సంఘటితంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీశ్ అరోరా, మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, రవీందర్‌రెడ్డి, మందడి శ్రీనివాస్‌రావు, ముద్దం నర్సింహాయాదవ్, తూము శ్రవణ్‌కుమార్, పగుడాల బాబురావు, సబీహాబేగం, పండాల సతీశ్‌గౌడ్, మాధవరం రంగారావు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, సీపీఐ మండల కార్యదర్శి జి.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

