గబరోన్: ఆఫ్రికా దేశం బోట్స్వానాలో ప్రస్తుతం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. బ్రిటన్ నుంచి స్వాతంత్య్ర పొంది 60 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం ఏనుగుల వేటకు అనుమతి ఇచ్చింది. 23 ఏనుగులను వేటాడి, వాటి మాంసాన్ని తినేందుకు ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. పర్యావరణ, టూరిజం శాఖ ఇచ్చిన ఆదేశాలపై విమర్శలు వస్తున్నాయి. స్వాతంత్య్ర సంబరాల కోసం ఏనుగు మాంసాన్ని పంచి పెట్టడం సరికాదు అని వన్యప్రాణుల సంరక్షణ అధికారులు, జంతు హక్కుల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏనుగులను రక్షించుకోవాలని ఎలిఫెంట్ ప్రొటెక్షన్ సొసైటీ చైర్మెన్ ఓటాసి నవా తెలిపారు.
సంబరాల కోసం ఏనుగు మాంసాన్ని తినాలన్న సందేశం దేశంలో తప్పుడు సంకేతాలను ఇస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల వన్యప్రాణుల సంరక్షణ ఇబ్బందిగా మారుతుందన్నారు. ఏనుగుల అక్రమ వేటను ఇది ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. ప్రస్తుతం బోట్స్వానాలో ఫూట్ అండ్ మౌత్ వ్యాధి ప్రబలుతున్నది. ఈ దశలో ఏనుగుల మాంసాన్ని తినేందుకు ప్రభుత్వం ఓకే చెప్పడం మరింత సమస్యను క్రియేట్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. సంస్కృతి, పర్యావరణం దృష్టిలో ఏనుగులకు ప్రత్యేకత ఉందని, వాటికి బదులుగా దున్నపోతులను వేటాడితే బాగుండేదని ఓ స్థానిక తెగ వ్యక్తి చెప్పారు.
బోట్స్వానాలోని 8 జిల్లాల్లో 23 ఏగనుల వేటకు అనుమతి దక్కింది. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఏనుగలను చంపారో తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఏనుగులు ఉన్న దేశం బోట్స్వానా. ఆ దేశంలో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 1,30,000 ఏనుగులు ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో లేదో .. అనేక ప్రాంతాల్లో ఏనుగుల కళేబరాల వద్ద జనం మాంసం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. పంటలు, ప్రాపర్టీని ఏనుగులు డ్యామేజ్ చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఏనుగుల జనాభాను నియంత్రించేందుకు వేటను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వేట ద్వారా వచ్చిన డబ్బును ఏనుగుల సంరక్షణ, అభివృద్ధికి వాడుకోవచ్చు అని ప్రభుత్వం చెబుతోంది.