మాఫియాతో మైనింగ్ శాఖ కుమ్మకు!
రాష్ట్రంలోని ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. అక్రమార్కులు వివిధ రూపాల్లో గనులను కొల్లగొడుతున్నారు.
- ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లకు గండి
- జీఎస్టీ ఎగవేత.. వేబిల్లుల మాయాజాలం
- గడువు ముగిసినా దర్జాగా క్రషర్ దందా
- కండ్లు మూసుకున్న గనుల శాఖ అధికారులు
- విజిలెన్స్ కొరడాతో బట్టబయలైన లీలలు
- అనుమతుల్లేకుండానే క్వారీల్లో పేలుళ్లు
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. అక్రమార్కులు వివిధ రూపాల్లో గనులను కొల్లగొడుతున్నారు. పన్నులు ఎగవేస్తూ, వేబిల్లుల మాయాజాలం సృష్టిస్తూ, గడువు ముగిసినా క్రషర్ దందా నిర్వహిస్తూ, అనుమతుల్లేకుండా క్వారీల్లో పేలుళ్లు నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన మైనింగ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
ఇటీవల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం నేరుగా రంగంలోకి దిగడంతో కండ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. క్షేత్రస్థాయిలో అక్రమ తవ్వకాలు, నిబంధనల ఉల్లంఘనలపై సాధారణ ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తినా గనుల శాఖ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం వెనుక లోతైన కుమ్మకు ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో రంగారెడ్డి, కరీంనగర్, మలాజిగిరి, గద్వాల జిల్లాల్లోని గ్రానైట్, కంకర క్వారీలు, స్టోన్ క్రషర్లపై విజిలెన్స్ బృందాలు ఇటీవల ఏకకాలంలో రెండు వారాలపాటు మెరుపు దాడులు నిర్వహించాయి.
మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం
ప్రభుత్వ ఖజానాకు ఏటా వందలాది కోట్ల రూపాయల మేర గండిపడుతున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం వారి బాధ్యతారాహిత్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతున్నది. క్వారీలు, క్రషర్ల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన భూగర్భ గనుల శాఖ అధికారులు.. మాఫియా ఇచ్చే నజరానాలకు అలవాటుపడి మిన్నకుండిపోయారన్న అనుమానాలు బలపడుతున్నాయి. అనుమతి లేని వాహనాలు రవాణా సాగిస్తున్నా, పేలుడు పదార్థాలు అక్రమంగా తరలిస్తున్నా చెక్‌పోస్టులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ఉన్న తెరవెనుక ఒప్పందాలు ఇప్పుడు విజిలెన్స్ విచారణలో ప్రధానాంశంగా మారాయి.
రవాణా పత్రాల్లో నామమాత్రపు పరిమాణం చూపి, క్షేత్రస్థాయిలో అంతకు రెట్టింపు ఖనిజాన్ని దర్జాగా తరలిస్తున్న వైనాన్ని విజిలెన్స్ అధికారులు ఆధారాలతో పట్టుకొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట సమీపంలో పట్టుబడిన లారీ పత్రాల్లో 9.096 క్యూబిక్ మీటర్లు అని ఉంటే, అసలు కొలతల్లో ఏకంగా 20.68 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ఉన్నట్టు తేలింది. ఇంతటి భారీ వ్యత్యాసం రవాణా అవుతున్నా నిత్యం రోడ్లపై ఉండే మైనింగ్, రవాణా శాఖల తనిఖీ బృందాల కంటపడకపోవడం వారి ప్రత్యక్ష సహకారానికి నిదర్శనంగా కనిపిస్తున్నది.
పన్నుల ఎగవేత
మైనింగ్ మాఫియా పన్నులు, రాయల్టీలను భారీగా ఎగ్గొట్టేందుకు పకడ్బందీ వ్యవస్థను నడుపుతున్నట్టు విజిలిన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. శంకరపట్నం నుంచి కరీంనగర్, బాజీపూర్కు తరలించిన గ్రానైట్ బ్లాకుల్లో 26.06 క్యూ.మీ. పరిమాణానికి బదులుగా 47.08 క్యూ.మీ., 7.526 క్యూ.మీ.కి బదులుగా 16.455 క్యూ.మీ. ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. దీనివల్ల వేలాది రూపాయల రాయల్టీతో పాటు భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్టు తేలింది.
గడువు ముగిసినా దర్జాగా దందా
మైనింగ్ లీజు అనుమతులు ముగిసి ఏండ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సీజ్ చేయకుండా మౌనం వహించడం విస్మయాన్ని కలిగిస్తున్నది. గద్వాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని ఓ స్టోన్ క్రషర్ లీజు గడువు గతంలోనే ముగిసినప్పటికీ, గనుల శాఖ చూసీచూడనట్టు వ్యవహరించడటంతో దాదాపు 20 నెలలుగా అక్రమ మైనింగ్ నిరాటంకంగా కొనసాగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో మరో క్రషర్ లీజు గడువు 15 ఏండ్ల క్రితమే ముగిసినా క్రషర్లు యథేచ్ఛగా నడుస్తూనే ఉన్నాయి.
అనుమతుల్లేకుండానే పేలుళ్లు
మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం కేవలం ఆదాయ నష్టానికే పరిమితం కాకుండా ప్రజల భద్రతను కూడా గాలికి వదిలేసే స్థాయికి చేరింది. గద్వాల క్వారీలో ఎలాంటి బ్లాస్టింగ్ లైసెన్స్ లేకుండానే దాచి ఉంచిన 400కు పైగా జిలెటిన్ స్టిక్స్‌ను విజిలెన్స్ బృందాలు స్వాధీనం చేసుకొన్నాయి. మేడ్చల్ జిల్లా కీసరలో ఎక్స్‌ప్లోజివ్ లైసెన్స్ గడువు ముగిసిపోగా, మరో ప్రాంతం లైసెన్స్‌ను చూపుతూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొండలను పేలుస్తున్నా స్థానిక అధికారులు కనీసం తనిఖీలు చేపట్టకపోవడం వారు కుమ్మకు అయిన తీరును స్పష్టం చేస్తున్నది.
స్థానిక అధికారులు తొకిపెట్టిన అక్రమాలను వెలికితీసేందుకు విజిలెన్స్ విభాగం ఎలక్ట్రానిక్ టోటల్ సర్వే (ఈటీఎస్) విధానాన్ని పూర్తిస్థాయిలో ప్రయోగిస్తున్నది. అనుమతి పొందిన విస్తీర్ణం ఎంత? వాస్తవంగా ఎంత లోతుకు కొండలను పిండి చేసి అక్రమ తవ్వకాలు జరిపారనేది ఈ సాంకేతిక సర్వే ద్వారా నిర్ధారిస్తున్నారు. శాస్త్రీయంగా నిర్ధారించే ఈ లెకలతో ప్రభుత్వానికి చేరాల్సిన కోట్ల రూపాయల రాయల్టీ, భారీ జరిమానాలను అక్రమారుల నుంచి ముకుపిండి వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అధికారులపై వేటు తప్పదా?
కేవలం వ్యాపారులపై కేసులు నమోదు చేయడంతోనే ఆగకుండా, వారికి కొమ్ముకాసిన మైనింగ్ శాఖ అధికారుల పాత్రపై విజిలెన్స్ నివేదికలు సిద్ధం చేస్తున్నది. ఏండ్ల తరబడి నిబంధనలు ఉల్లంఘిస్తున్నా చర్యలు తీసుకోని క్షేత్రస్థాయి అధికారుల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. శాఖాపరమైన విచారణతోపాటు అక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకొంటేనే ఇలాంటి వ్యవస్థీకృత మాఫియాకు ముకుతాడు పడుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

