‘పెట్టుబడుల’ లీక్‌పై రాజకీయ ప్రకంపనలు
పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య నెలకొన్న వివాదం రెండు రాష్ర్టాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది.
- దిద్దుబాటు చర్యల్లో రెండు రాష్ర్టాలు
- తొలిగించింది ఇద్దరినేనని, మరో13 మంది స్వచ్ఛందంగా వెళ్లారని ప్రకటన
చెన్నై/అమరావతి: పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య నెలకొన్న వివాదం రెండు రాష్ర్టాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది. తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులను ఏపీ దకించుకొంటున్నదని, ఇందుకోసం గైడెన్స్‌లో పనిచేసిన ఉద్యోగులు గూఢచర్యం చేశారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలతో 15 మంది ఉద్యోగులను తొలిగించినట్టు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. 15మంది గైడెన్స్ సంస్థను వీడటం నిజమే అయినా.. అందులో 13 మంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారని, ఇద్దరిని మాత్రమే తొలిగించినట్టు తేలింది. 10 మందికి జాబ్ ఆఫర్ ఇవ్వగా, ముగ్గురు మాత్రమే చేరారని ఏపీ తరఫున వాదనలు వినిపిస్తున్నాయి.
జూనియర్ వికటన్ కథనంతో ఆజ్యం
తమిళనాడు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 1992లో గైడెన్స్ అనే సంస్థ ఏర్పాటైంది. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతాల గుర్తింపు వంటి బాధ్యతలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు తాజా వివాదానికి వేదికగా మారింది. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. గైడెన్స్‌లో గతంలో పనిచేసిన కొందరు ఉద్యోగులు ఈ సదస్సు నిర్వహణలో భాగస్వాములయ్యారని ఈ నెల 18న తమిళ పత్రిక జూనియర్ వికటన్‌లో ప్రచురితమైన కథనం ఈ వివాదానికి ఆజ్యంపోసింది. గైడెన్స్‌లో కీలక స్థానాల్లో పనిచేసిన ఉద్యోగులు ఇప్పుడు ఏపీతో కలిసి పనిచేస్తున్నారని పేర్కొన్నది. పరిశ్రమల శాఖ మాజీ మంత్రి రాజాకు సన్నిహితులని, టీవీకే ప్రభుత్వం వారిని తొలిగించిందని వెల్లడించింది.
15 మంది తొలగింపు.. కాదు ఇద్దరే
డాటా లీక్ అంశాన్ని ఈ నెల 19న వికటన్, పొలిమర్ న్యూస్, ఇండియా టుడే హైలెట్ చేశాయి. కీలక సమాచారాన్ని ఏపీ అధికారులకు చేరవేశారన్న కారణంతో గైడెన్స్‌కు చెందిన 15 మంది ఉద్యోగులను తొలగించినట్టు కథనాలు ప్రచురించాయి. వారంతా డీఎంకే ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారని, రహస్యంగా ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నాయి. గైడెన్స్‌లో ప్రాజెక్ట్ ఎక్సలెన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన క్రిస్టో లారెల్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ విభాగం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ప్రభాకరన్‌కు జూన్ 29న సంస్థ యాజమాన్యం అకస్మాత్తుగా రిలీవింగ్ లెటర్లు ఇచ్చిందని పేర్కొన్నారు. అనంతరం వారిద్దరూ ఏపీఈడీబీలో చేరారు. దీనికి కొనసాగింపుగా జూలై నెలలో మరో 13 మంది ఉద్యోగులు గైడెన్స్‌కు రాజీనామా చేశారు. యాజమాన్యం నుంచి తరచూ బెదిరింపులు ఎదురవుతున్నాయని, వేతనాల్లోనూ అసమానతలు ఉన్నాయని ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నట్టు తెలిపారు.
సమాచారం లీక్ చేయలేదు
తాము ఎలాంటి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లలేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. జూలైలో రాజీనామా చేసిన ఉద్యోగుల్లో ఒకరు తన నోటీసు గడువు ముగిసిన చివరిరోజున తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం కార్యాలయానికి ఈమెయిల్ పంపారు. గైడెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ జాకబ్ తనను అవమానించారని ఆరోపించారు. తమిళనాడు పరిశ్రమలశాఖ మంత్రి కీర్తన తన సన్నిహితులుగా భావించే ఉద్యోగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇతర అధికారుల వ్యవహారశైలిపైనా ఆందోళన వ్యక్తంచేశారు. ‘అదే మా చివరి పనిదినం అవుతుందని మాకు తెలియదు. 15 నిమిషాల్లోనే మా ఈ-మెయిల్, సీఆర్ఎం యాక్సెస్‌ను నిలిపివేశారు. ఏపీ ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేసే ఒక వ్యక్తి తెలిపిన వివరాల మేరకు.. గైడెన్స్‌ను విడిచిపెట్టిన 15 మందిలో 10 మందికి ఏపీఈడీబీ ఉద్యోగ అవకాశం ఇచ్చిందని, వారిలో ముగ్గురు మాత్రమే చేరారని వివరించారు.
ఉద్యోగులు మారడం సహజమే
తమస్థాయిని పెంచుకోవాలనుకొనే కంపెనీలు నిపుణులను నియమించుకోవడం సహజమేనని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత పరిచయంతో పెట్టుబడులు పెట్టరని స్పష్టంచేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సులో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రావడంపై తమిళనాడు మాజీ పరిశ్రమల శాఖ మంత్రి, డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి రాజా స్పందించారు. ఈ ఒప్పందాల్లో చాలా వరకు తమిళనాడుకే వచ్చి ఉండాల్సినవని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం పళనిస్వామి.. ప్రభాకరన్, క్రిస్టోలకు జూన్ 29న జారీచేసిన రిలీవింగ్ లెటర్లను బయటపెట్టారు. ఈ వ్యవహారంపై టీవీకే ప్రభుత్వం వివరణ ఇవ్వాలని , గూఢచర్యం ఆరోపణల్లో మంత్రి కీర్తన పాత్ర ఏమిటని ప్రశ్నించారు. విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం హాట్‌టాపిక్‌గా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

